బాలుడిని చంపేసి.. ఆత్మహత్య చేసుకుని..!

చోరీ చేసి.. డబ్బులు పంచుకునే క్రమంలో జరిగిన గొడవలో ఓ యువకుడు బాలుడిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated : 22 Apr 2024 07:37 IST

జోగిపేటలో యువకుడి దారుణం
చోరీ చేసి, డబ్బులు పంచుకోవడంలో గొడవ

జోగిపేట, న్యూస్‌టుడే: చోరీ చేసి.. డబ్బులు పంచుకునే క్రమంలో జరిగిన గొడవలో ఓ యువకుడు బాలుడిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. సీఐ అనిల్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జోగిపేటకు చెందిన వడ్డె నాగరాజు (24)కు బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. మేనమామ వద్ద ఉంటూ, జులాయిగా తిరుగుతూ, చెడు వ్యసనాలకు బానిసై చిల్లర దొంగతనాలు చేస్తుండేవాడు. కొద్ది రోజులుగా ఓ పాత ఇనుప సామగ్రి దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మరో దుకాణంలో పనిచేస్తున్న బాలుడి (14)తో పరిచయం పెరిగింది. ఇద్దరూ కలిసి బాలుడు పనిచేస్తున్న దుకాణంలో శనివారం కాపర్‌ తీగను చోరీ చేశారు. దాన్ని నాగరాజు పనిచేస్తున్న దుకాణంలో అమ్మారు. సుమారు రూ.20 వేలు వచ్చాయి. ఆ డబ్బును పంచుకోవడంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో బాలుడిపై కక్ష పెంచుకున్న నాగరాజు, మాయమాటలు చెప్పి అతణ్ని ఓ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ గొంతు నులిమి హత్యచేసి, మృతదేహాన్ని సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశాడు. అంతకుముందు స్థానికంగా ఉన్న ఓ చిరువ్యాపారిపైనా దాడికి పాల్పడ్డాడు. ఆ వ్యాపారిని డబ్బులు డిమాండ్‌ చేయగా.. ఇవ్వనని చెప్పడంతో ఆగ్రహించి ఇనుప రాడ్డుతో అతని తలపై కొట్టడంతో అతను గాయపడ్డాడు.

ఈ ఘటనలతో భయాందోళనలకు లోనైన నాగరాజు శనివారం రాత్రి సమీపంలోని ఓ సెల్‌టవర్‌ ఎక్కి ఫోన్‌ ద్వారా జరిగిన విషయాలపై స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో అతన్ని కిందకు దింపేందుకు యత్నించిన ఓ వ్యక్తిపై కూడా కొడవలితో దాడిచేసి గాయపర్చాడు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని టవర్‌ దిగమని ఎంతచెప్పినా వినలేదు. రాత్రంతా టవర్‌పైనే ఉన్న అతను ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రాణాలతోనే ఉన్నాడు. బాలుడు ఏమయ్యాడని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా చంపేసి బావిలో పడేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి బాలుడి మృతదేహాన్ని బయటకు తీయించారు. టవర్‌పైనే ఉన్న నాగరాజుకు సంబంధించి కదలికలు లేకపోవడంతో, పరిస్థితిని నిర్ధరించేందుకు డ్రోన్‌ కెమెరా ద్వారా పరిశీలించారు. అప్పటికే అతను కేబుల్‌ వైర్లు మెడకు చుట్టుకుని మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను పైకి పంపించి మృతదేహాన్ని కిందకు దింపించారు. ఇద్దరి మృతదేహాలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని