రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి

తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్‌ వేశారు.

Published : 23 Apr 2024 03:48 IST

పల్నాడు జిల్లాలో వైకాపా శ్రేణుల బరితెగింపు
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై దాడి

సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా సమీప గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పెదమక్కెన ఎస్సీకాలనీకి చెందిన యువకులు సుమారు 20 ద్విచక్ర వాహనాలపై బయలుదేరి పెదకూరపాడు సమీపంలోని బంకుకు వెళ్లారు. అక్కడే వైకాపా అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆ పార్టీ కార్యకర్తలూ ద్విచక్ర వాహనాలతో ఉన్నారు. తెదేపా కార్యకర్తలను చూసిన వారు.. మద్యం తాగుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. కాసేపటికే పెదకూరపాడు నుంచి సుమారు 30 మందిని వైకాపా కార్యకర్తలు రప్పించారు. అంతా కలిసి తెదేపా వారిపై రాళ్లు, జెండా కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో తెదేపా కార్యకర్తలు మట్టుపల్లి మేరీబాబు, దిడ్లా చిననాగరాజు, మట్టుపల్లి సంగీతరావు, జరుగుమల్లి యేషయా, మట్టుపల్లి అనిల్‌, దిడ్లా పెదనాగరాజులకు గాయాలయ్యాయి. బాధితులను ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా.. తీవ్రంగా గాయపడిన మేరీబాబు, చిన నాగరాజును మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. బాధితులను కన్నా లక్ష్మీనారాయణ, పలువురు నాయకులు పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని