మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!

మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది.

Published : 23 Apr 2024 06:26 IST

మూసాపేట, న్యూస్‌టుడే: మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. కూకట్‌పల్లి వైజంక్షన్‌లోని ఓ భవనం సెల్లారులోని షట్టరు ముందు ఆదివారం తెల్లవారుజామున చిత్తు కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని మహిళ(45)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి పరారైన ఘటన తెలిసిందే. రక్తస్రావంతో బాధితురాలు ఘటనా స్థలంలోనే మృతిచెందింది. ఈ అమానుషానికి పాల్పడిన యువకులు సంగారెడ్డికి చెందిన వారుగా విచారణలో తేలింది. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని గుర్తించి దర్యాప్తు చేపట్టడంతో ఆచూకీ లభించింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. ఆ యువకులు సంగారెడ్డిలోనే ఉన్న ఓ బార్‌లో పనిచేస్తారని తేలింది. బార్‌లో అర్ధరాత్రి వరకు పనిచేసిన వారు బాగా మద్యం తాగి ద్విచక్ర వాహనంపై వైజంక్షన్‌ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో అటుగా నడుచుకుంటూ వచ్చిన బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు. ఆమె మూసాపేటలో ఉండేదని, ఆరు నెలల క్రితం వరకు ఓ వాహన షోరూంలో స్వీపర్‌గా పని చేసేదని తెలిసింది. అక్కడ సిబ్బందిని విచారించినా ఆమె చిరునామా తెలియలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని