మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు

పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి.

Updated : 23 Apr 2024 07:03 IST

కంటెయినర్‌ లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు
పుట్టినరోజు వేడుకలు ముగించుకొని వస్తూ దంపతుల మృతి

మునగాల, న్యూస్‌టుడే: పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. రోడ్డు ప్రమాదం వారిద్దరినీ బలిగొనడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులోని పెట్రోలుబంకు వద్ద.. ఆగి ఉన్న కంటెయినర్‌ లారీని కారు ఢీకొట్టడంతో భార్యాభర్తలు మృతిచెందారు. సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై అంజిరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్‌రాజా (29), ఏపీలోని ఎన్‌టీఆర్‌ జిల్లా విస్సన్నపేటకు చెందిన భార్గవి (27)లకు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇంకా సంతానం లేదు. నవీన్‌రాజా విజయవాడ గూడవల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫిజిక్స్‌ అధ్యాపకుడు. భార్గవి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. శనివారం భార్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి నవీన్‌ ఆమెతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. శని, ఆదివారాలు ఆనందంగా గడిపిన వారు సోమవారం ఉదయం 6 గంటలకు కారులో విజయవాడకు బయలుదేరారు. నవీన్‌ కారు నడుపుతుండగా.. పక్కసీట్లో భార్గవి కూర్చున్నారు. మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామ శివారులో పెట్రోలుబంకు వద్ద ఆగి ఉన్న కంటెయినర్‌ లారీని.. వీరి కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు టాప్‌ ఎగిరి పక్కనే ఉన్న బంకులో పడింది. భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు.. స్థానికుల సహాయంతో జేసీబీ, క్రేన్‌తో రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీయించారు. జాతీయ రహదారి పక్కన కంటెయినర్‌ లారీని నిలిపి ఉంచడం వల్లే దంపతుల జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని