ఇంటర్‌లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.

Published : 25 Apr 2024 03:11 IST

నస్పూర్‌, తాండూరు, ముదిగొండ, డోర్నకల్‌, మహబూబాబాద్‌ రూరల్‌, రాజేంద్రనగర్‌, రామచంద్రాపురం రూరల్‌, న్యూస్‌టుడే: ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నతంగా స్థిరపడతారని ఆశించిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు.

  • మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలానికి చెందిన విద్యార్థిని(18) మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతోంది. రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో మనస్తాపానికి గురైంది. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ రావడం లేదని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి పై అంతస్తులోకి వెళ్లింది. చాలా సమయమైనా కిందికి రాకపోవడంతో తల్లిదండ్రులు పై అంతస్తుకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది.
  • మంచిర్యాల జిల్లా తాండూరు మండలానికి చెందిన విద్యార్థి(16) మొదటి సంవత్సరం(ఎంపీసీ) చదువుతున్నాడు. నాలుగు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణుడు కాలేదు. మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
  • ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన విద్యార్థిని(17) మొదటి సంవత్సరం మ్యాథ్స్‌లో ఫెయిల్‌ అయ్యింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె ఫెయిల్‌ అయినట్లు తెలిసి.. ఫర్వాలేదులే అని ధైర్యం చెప్పానని అయినా ఇలా చేస్తుందనుకోలేదని తండ్రి వాపోయారు.
  • మహబూబాబాద్‌ మండలం రెడ్యాలకు చెందిన విద్యార్థిని(16) సీఈసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఎకనామిక్స్‌లో ఫెయిల్‌ కావడంతో వ్యవసాయ బావిలో దూకి ఉసురు తీసుకుంది.
  • మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం చిల్కోడుకు చెందిన విద్యార్థిని(17) బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. బోటనీలో ఫెయిలైంది. ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఉరేసుకుంది.
  • రంగారెడ్డి జిల్లా హైదర్‌గూడలో నివాసం ఉండే విద్యార్థిని(16) ఎంపీసీ మొదటి సంవత్సరం ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేదు. మనోవేదనకు గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీకి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
  • సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ పురపాలక పరిధి కొల్లూరులో ఉంటున్న విద్యార్థి(17) ఇంటర్‌ ఎంపీసీ పూర్తి చేశాడు. ఫలితాలు చూసుకుని చెరువు గట్టు దగ్గరకు వెళ్లి అక్కడ ఉరేసుకున్నాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని