పోలీసులు కొట్టారని ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య

నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌ పోలీసులు కొట్టారని మనస్తాపానికి గురై శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 18 May 2024 02:38 IST

వెంకటయ్య

తెలకపల్లి, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌ పోలీసులు కొట్టారని మనస్తాపానికి గురై శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుబసభ్యుల కథనం ప్రకారం.. వెంకటయ్య(43) ఆటో నడుపుతూ జీవిస్తున్నారు. ఎక్కువగా నాగర్‌కర్నూల్‌కు వెళ్లి ఆటో నడిపిస్తుంటారు. ఈ నెల 14న ఓ ప్రయాణికురాలు ఆటోలో బంగారు గొలుసు చోరీ అయినట్లు ఫిర్యాదు చేశారని చెప్పి నాగర్‌కర్నూల్‌ పోలీసులు వెంకటయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆయన కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇవ్వగా.. వెంకటయ్య భార్య అలివేలు, కుమార్తె శిరీష వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దెబ్బలతో గాయపడిన స్థితిలో వెంకటయ్య ఠాణాలోని ఓ మూలన కూర్చోవడాన్ని చూశామని వారు చెప్పారు. ఆటోను అక్కడే ఉంచుకుని.. మర్నాడు రావాలంటూ వెంకటయ్యను ఇంటికి పంపేశారు. కానీ జ్వరం రావడంతో 15న ఇంటి దగ్గరే ఉండిపోయారు. 16న పోలీసులు ఫోన్‌ చేసి స్టేషన్‌కు రావాలని పిలిచారు. తనను పోలీసులు కొడతారని వెంకటయ్య కుటుంబసభ్యుల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత స్థానికంగా చెరువు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. ఈ విషయమై ఎస్సై గోవర్ధన్‌ను వివరణ కోరగా.. ఆటోలో గొలుసు చోరీ ఫిర్యాదుపై వెంకటయ్యను పిలిచి మందలించామని, కొట్టలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని