సీశామ్‌ కలవరం!

‘‘ హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా మైనర్ల అశ్లీల వీడియో(ఛైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజివ్‌ మెటీరియల్‌- సీశామ్‌) షేర్‌ అయ్యింది.

Updated : 18 May 2024 09:41 IST

ఆందోళనకరంగా చిన్నారుల అశ్లీల వీడియోల వ్యాప్తి
నెల రోజుల్లోనే 12 కేసులు బహిర్గతం
ఎన్‌సీఆర్‌బీ టిప్‌లైన్‌ ఆధారంగా టీఎస్‌సీఎస్‌బీ దర్యాప్తు

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా మైనర్ల అశ్లీల వీడియో(ఛైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజివ్‌ మెటీరియల్‌- సీశామ్‌) షేర్‌ అయ్యింది. ఛైల్డ్‌ పోర్నోగ్రఫీపై నిఘా ఉంచే అమెరికా నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ చిల్డ్రన్‌(నెక్‌మెక్‌) ఈ విషయాన్ని గుర్తించింది. ఆ వీడియో గురించి ఆరా తీసి జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ)కు సమాచారం అందించింది. అది తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ)ను అప్రమత్తం చేసింది. ఇక్కడి అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేసి హైదరాబాద్‌ బండ్లగూడ హఫీజ్‌బాబానగర్‌కు చెందిన వ్యక్తి ఫోన్‌ నుంచి ఆ వీడియో బయటకు వచ్చినట్లు తేల్చింది. దీంతో ఇటీవలే అతనిపై కేసు నమోదు చేశారు.’’

రాష్ట్రంలో ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ చాపకింద నీరులా పాకుతోంది. పిల్లల అశ్లీల దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్న ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో బండ్లగూడ, యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌లలో బహిర్గతం కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ తరహా ఉదంతాలపై ఆయా యూనిట్ల పోలీసులను టీఎస్‌సీఎస్‌బీ అప్రమత్తం చేస్తోంది. సాధారణంగా ఈ బాలల అశ్లీల వీడియోలపై ప్రపంచవ్యాప్తంగా నెక్‌మెక్‌ నిఘా ఉంచుతుంది. ఎప్పటికప్పుడు సైబర్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ ఐపీ అడ్రస్‌ల ఆధారంగా ఆయా దేశాలను అప్రమత్తం చేస్తుంది. అదే క్రమంలో భారత్‌ నుంచి అలాంటి వీడియోలు వ్యాప్తి జరిగినట్లు  తేలితే ఎన్‌సీఆర్‌బీకి తరచూ టిప్‌లైన్స్‌(నివేదికలు) పంపుతోంది. ఎన్‌సీఆర్‌బీ ఆయా రాష్ట్రాలకు వాటిని చేరవేస్తోంది. గతంలో తెలంగాణకు సంబంధించిన సమాచారాన్ని సీఐడీకి పంపించేది. గత జూన్‌ నుంచి టీఎస్‌సీఎస్‌బీ ఈ కేసుల్ని పర్యవేక్షిస్తోంది. ఈ బ్యూరోకు ఈ ఏడాది కాలంలో 42 టిప్‌లైన్స్‌ అందడం గమనార్హం. ఇందులో గత నెల రోజుల్లో వచ్చినవే 12 ఉన్నాయి.

వ్యాప్తి చేసే వారిపై సస్పెక్ట్‌ షీట్లు

గతంలోనూ ఈ తరహా కేసులపై ఫిర్యాదులు అందాయి. ప్రముఖ ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ యాప్‌ ద్వారా ఈ  వీడియోలు వ్యాప్తి జరుగుతున్నాయని గతేడాది ఓ ఎన్‌జీవో సంస్థ ప్రతినిధి డీజీపీకి ఫిర్యాదు చేశారు. 31 వేల మందితో కూడిన బృందం చిన్నారుల అశ్లీల వీడియోలను ఆన్‌లైన్‌లో రూ.100 ఒకటి చొప్పున విక్రయిస్తున్నట్లు చెప్పడం అప్పట్లో కలకలం రేపింది. తాజాగా మరోసారి ఎన్‌సీఆర్‌బీ టిప్‌లైన్స్‌ ఆధారంగా మరిన్ని ఉదంతాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ నేపథ్యంలో మైనర్ల వీడియోలను వ్యాప్తి చేసే వారిపై తెలంగాణ పోలీసులు సస్పెక్ట్‌ షీట్లు తెరుస్తున్నారు. వీటి ద్వారా వరుసగా నేరాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం ప్రయోగించే యోచనలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని