పనికి వెళుతూ.. ప్రాణాలొదిలారు

ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళుతున్న భార్యాభర్తలు, వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలొదిలారు.  ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగింది.

Published : 18 May 2024 04:33 IST

డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం
కుమారుడు సహా దంపతుల దుర్మరణం

శ్రీనివాస్‌, సునీత

జోగిపేట టౌన్, జుక్కల్, మద్నూర్‌- న్యూస్‌టుడే: ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళుతున్న భార్యాభర్తలు, వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలొదిలారు.  ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గం మద్నూర్‌ మండలం పెద్ద తడ్గూర్‌ గ్రామానికి చెందిన సుంగూర్‌వార్‌ శ్రీనివాస్‌(35), సుంగూర్‌వార్‌ సునీత(30)లు భార్యాభర్తలు.. వీరు హైదరాబాద్‌లోని ఇస్నాపూర్‌లో ఉంటున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూరొచ్చారు. కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. వీరు తిరిగి పనికోసం శుక్రవారం ద్విచక్రవాహనంపై తమ చిన్నకుమారుడు నగేశ్‌(7)ను తీసుకుని హైదరాబాద్‌ బయల్దేరారు. 161వ (సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా) నంబరు జాతీయ రహదారిపై సంగారెడ్డి జిల్లా అందోలు మండలం రాంసానిపల్లి వద్ద వీరి వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. కొనఊపిరితో ఉన్న బాలుడిని ఎస్సై అరుణ్‌కుమార్‌గౌడ్‌ తన వాహనంలో జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోయింది. శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు అవినాష్‌ నాయనమ్మ వద్ద ఉంటున్నాడు. చిన్న కుమారుడు నగేశ్‌ తల్లిదండ్రులతో వెళ్తూ ప్రమాదంలో కన్నుమూశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని