ఫోన్‌లోనే ట్రిపుల్‌ తలాక్‌.. నిందితుడిపై కేసు నమోదు

తన మొదటి భార్యకు ఫోన్‌లో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన నిందితుడిపై ఆదిలాబాద్‌ మహిళా పోలీసు స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది.

Published : 19 May 2024 03:04 IST

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే : తన మొదటి భార్యకు ఫోన్‌లో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన నిందితుడిపై ఆదిలాబాద్‌ మహిళా పోలీసు స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. మహిళా పోలీసుస్టేషన్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ పట్టణం కేఆర్‌కే కాలనీలో నివాసముండే అబ్దుల్‌ అతీఖ్‌... అదే కాలనీకి చెందిన యువతిని 2017లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండేళ్ల నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. అదనపు కట్నం కోసం ఆమెను అబ్దుల్‌ అతీఖ్‌ వేధించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ కేసు విచారణ అనంతరం బాధితురాలికి పిల్లల పోషణ ఖర్చులు చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించినా అతడు చెల్లించడం లేదు. అబ్దుల్‌ అతీఖ్‌ ఏడాది క్రితం రెండో వివాహం చేసుకొని మరో కాలనీలో నివాసముంటున్నాడు. ఈ నెల 11న ‘నేను నీకు తలాక్‌ ఇస్తున్నాను. ఇక నుంచి నీతో నాకెలాంటి సంబంధం లేదు. మనం భార్య, భర్తలం కాదు.. తలాక్‌.. తలాక్‌.. తలాక్‌’ అంటూ వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌ రికార్డు చేసి పంపించాడు. దీంతో బాధితురాలు శనివారం మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ది ముస్లిం ఉమెన్‌ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్్స ఆన్‌ మ్యారేజ్‌) చట్టం-2019 మేరకు కేసు నమోదుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని