ఫుట్‌బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం

రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సు ఫుట్‌బోర్డుపై నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు వెనక టైరు కిందపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 19 May 2024 06:05 IST

ఆర్టీసీ బస్సు రద్దీతో ప్రమాదం

దూరి అనూష 

కొణిజర్ల, న్యూస్‌టుడే: రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సు ఫుట్‌బోర్డుపై నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు వెనక టైరు కిందపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన దూరి అనూష (26) ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ మాల్‌లో చిరుద్యోగి. రోజూలాగే విధులకు వెళ్లేందుకు శనివారం ఉదయం కొణిజర్లలో ఆర్టీసీ బస్సెక్కారు. ప్రయాణికుల రద్దీతో లోపలకు వెళ్లే అవకాశం లేక ఫుట్‌బోర్డు అంచునే నిల్చున్నారు. కొద్దిదూరం వెళ్లాక ముందు వెళ్లే బస్సును అధిగమించే క్రమంలో డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేసి వెంటనే వేగంగా వాహనాన్ని ముందుకు కదిలించాడు. ఆ సమయంలో అదుపుతప్పిన అనూష ఫుట్‌బోర్డు నుంచి జారి కిందపడ్డారు. వెనక టైరు ఆమె శరీరం పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదాన్ని చూసి ప్రయాణికులంతా భీతిల్లారు. ఘటనా స్థలాన్ని ఎస్సై శంకరరావు, ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బస్సు డ్రైవర్‌ (భద్రాచలం డిపో) నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని మృతురాలి భర్త అశోక్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనూషకు ఆరేళ్ల లోపు కుమార్తెలు ఇద్దరు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని