దివ్యాంగురాలైన తల్లి.. ఇద్దరు కూతుళ్లను కడతేర్చిన కిరాతకుడు

భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు.

Updated : 19 May 2024 07:28 IST

ఆస్తి కోసం ఘాతుకం
ఖమ్మం జిల్లా గోపాలపేటలో ఘటన

నిందితుడు వెంకటేశ్వర్లు

తల్లాడ, న్యూస్‌టుడే: భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు. కానీ గ్రామంలోని పొలంపై కన్నేసిన ఆమె కొడుకు అర్ధరాత్రి వేళ తల్లితో సహా ఇద్దరు కూతుళ్లనూ పాశవికంగా కడతేర్చి పరారయ్యాడు. ఈ అమానవీయ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన   వివరాల ప్రకారం..

గోపాలపేటలో పిట్టల వెంకటేశ్వర్లుకు దివ్యాంగురాలు (ఒక కన్ను కనిపించదు) అయిన తల్లి పిచ్చమ్మ(60), కూతుళ్లు నీరజ(11), ఝాన్సీ(6) ఉన్నారు. రెండేళ్ల క్రితం భార్య కనకదుర్గ చనిపోయారు. ఈ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన రెండు పడక గదుల ఇల్లు, ఎకరం పది గుంటల పొలంలో సగం ఇద్దరు పిల్లలకు దక్కేలా పెద్దల సమక్షంలో ఒప్పందం రాసుకున్నారు. తరువాత వెంకటేశ్వర్లు తల్లాడకు చెందిన త్రివేణిని రెండో వివాహం చేసుకొని పిల్లలను, తల్లిని వదిలేసి ఖమ్మంలో కాపురం పెట్టాడు. దీంతో పిచ్చమ్మనే మనవరాళ్ల బాగోగులు చూసుకుంటూ వస్తున్నారు. నీరజ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఇటీవలే నాలుగో తరగతి పూర్తి చేయగా.. ఐదో తరగతికి కల్లూరులోని గురుకుల పాఠశాలలో సీటు రావడంతో చేరింది. ఝాన్సీ అంగన్‌వాడీ విద్య పూర్తి చేసింది. డ్రైవరుగా పని చేసే వెంకటేశ్వర్లు కొంతకాలంగా చెడు వ్యసనాలతో అప్పులపాలయ్యాడు. వాటిని తీర్చేందుకు తల్లి పిచ్చమ్మ పేరున ఉన్న దాదాపు అరెకరం పొలాన్ని అమ్మాలంటూ అప్పుడప్పుడు వచ్చి గొడవపడేవాడు. మనవరాళ్ల భవిష్యత్తు దృష్ట్యా అమ్మేది లేదంటూ ఆమె నిరాకరిస్తూ వచ్చేవారు. దీంతో కక్ష పెంచుకొని ముగ్గురినీ అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు.

మృతులు పిచ్చమ్మ, నీరజ, ఝాన్సీ

శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో గ్రామంలో పక్కింటి వారికి ఫోన్‌ చేసిన వెంకటేశ్వర్లు పిచ్చమ్మ, నీరజలను పిలిపించి మాట్లాడాడు. తాను కాసేపట్లో ఇంటికి వస్తున్నానని చెప్పడంతో కూతురు సంతోష పడింది. కానీ రోజూ తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేచే పిచ్చమ్మ శనివారం ఉదయమైనా కనిపించకపోవడంతో చుట్టుపక్కల మహిళలు వెళ్లి చూడగా రేకులషెడ్డు కింద తిరగల వేసిన మంచంపై పిచ్చమ్మ, నీరజ, ఝాన్సీలు విగతజీవులుగా కనిపించారు. ముగ్గురికీ గొంతు, ముఖం, శరీర భాగాలపై గాయాలు ఉన్నాయి. నీరజ నోటిలో నురగ కూడా ఉంది. ఆస్తి కోసమే వారిని వెంకటేశ్వర్లు హతమార్చి పరారైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అర్ధరాత్రి వచ్చి ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని వైరా ఏసీపీ రహమాన్, సీఐ సాగర్, ఎస్సై వంశీకృష్ణ, భాగ్యరాజ్‌లు పరిశీలించారు. వెంకటేశ్వర్లు బావమరిది, కనకదుర్గ సోదరుడు మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు తల్లాడ ఏఎస్సై జేవియర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు