సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా

పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం..

Published : 19 May 2024 06:06 IST

నిందితుడి అరెస్టు

హైదరాబాద్, న్యూస్‌టుడే: పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన తోట బాలాజీ నాయుడు అలియాస్‌ మల్లారెడ్డి అలియాస్‌ దాసరి అనిల్‌కుమార్‌ (50) ఇటీవల తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేశాడు. తాను రాష్ట్ర ఆర్థికశాఖ అదనపు కార్యదర్శినని పరిచయం చేసుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రుణ పథకం ప్రారంభిస్తోందని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నారని, దీనికి జనాన్ని తరలించాల్సి ఉందని చెప్పాడు. ఒక్కొక్కరికి కనీసం రూ.3,600 చొప్పున మొత్తం రూ.3.60 లక్షలు పంపించాలన్నాడు. నిందితుడు చెప్పింది నిజమేనని నమ్మిన ఎమ్మెల్యే.. అతడు చెప్పిన బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ చేసేశారు. ఖాతాలో డబ్బులు పడగానే నిందితుడు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. దీంతో తనను మోసగించాడని ఎమ్మెల్యేకు అర్థమైంది. దీనిపై ఆయన వ్యక్తిగత కార్యదర్శి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా రకరకాల పథకాల పేర్లు చెబుతూ.. ఏపీ, తెలంగాణలోని పలువురు ప్రజాప్రతినిధులను నిందితుడు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ వెబ్‌సైట్‌ ద్వారా ఎమ్మెల్యే, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఫోన్‌ నంబర్లు సేకరించి.. వారికి ఫోన్లు చేస్తున్నట్లు విచారణలో నిందితుడు వెల్లడించాడు. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో 37 కేసులు ఉన్నాయి. ఇతడు రామగుండం ఎన్‌టీపీసీలో 2008లో ఏఈగా చేరాడు. 2009 ఫిబ్రవరిలో ఓ ఎమ్మెల్యే పీఏ నుంచి లంచం తీసుకుంటుండగా సీబీఐ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం కరీంనగర్‌ జైలుకు తరలించారు. ఆ కేసులో విడుదలైన అనంతరం విశాఖ పరవాడ సింహాద్రి పవర్‌ ప్లాంట్‌లో ఉద్యోగంలో చేరాడు. అక్కడా మోసాలకు పాల్పడుతుండటంతో ఉద్యోగం నుంచి తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని