పెళ్లింట తీవ్ర విషాదం

పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో దుస్తులు కొనుగోలు చేయడానికి కుటుంబ సభ్యులందరూ అనంతపురం నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. రోజంతా షాపింగ్‌ చేసి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే అలసిపోవడంతో అందరూ నిద్రపోయారు.

Published : 19 May 2024 06:05 IST

దుస్తుల కొనుగోలుకు హైదరాబాద్‌ వెళ్లి వస్తుండగా ప్రమాదం
అదుపుతప్పి డివైడర్‌ ఎక్కి.. అవతలివైపు లారీని ఢీకొన్న కారు
వరుడు సహా ఒకే కుటుంబంలోని ఆరుగురి మృత్యువాత

ప్రాణాలతో బయటపడిన మహ్మద్‌గౌస్‌ (డ్రైవర్‌ సీటులోని వ్యక్తి), ప్రమాద తీవ్రతకు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలు

గుత్తి, గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో దుస్తులు కొనుగోలు చేయడానికి కుటుంబ సభ్యులందరూ అనంతపురం నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. రోజంతా షాపింగ్‌ చేసి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే అలసిపోవడంతో అందరూ నిద్రపోయారు. మరో గంటలో ఇంటికి చేరుకుంటారనగా డ్రైవర్‌ కూడా నిద్రమత్తులోకి జారుకోవడంతో వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ ఎక్కి అవతలివైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు సహా అదే కుటుంబంలోని ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటుచేసుకొంది. పోలీసుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లాకేంద్రంలోని బిందెలోళ్లకాలనీకి చెందిన అల్లీసాహెబ్‌ కుమారుడు షేక్‌ ఫిరోజ్‌బాషాకు ఈ నెల 27న వివాహం నిశ్చయమైంది. పెళ్లిదుస్తులు కొనుగోలుకు 14 మంది కుటుంబీకులు రెండు కార్లలో శుక్రవారం ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం అక్కడికి చేరుకొని రాత్రి 10 గంటల వరకు షాపింగ్‌ చేశారు. తిరుగు ప్రయాణంలో అల్లీసాహెబ్‌ చిన్నకుమారుడు మహ్మద్‌గౌస్‌ ఒక కారు నడుపుతుండగా, వారి బంధువు మరో కారు నడిపిస్తున్నారు. కర్నూలుకు రాగానే వర్షం కురవడంతో మహ్మద్‌గౌస్‌ తన కారును కొంతసేపు ఆపారు. మరో కారులోని వారు అలాగే అనంతపురానికి చేరుకున్నారు. 

నిద్రమత్తులోకి జారుకోవడంతో..

శనివారం ఉదయం 6.30 గంటలకు గుత్తి మండలం కరిడికొండ గ్రామ సమీపంలోకి రాగానే మహ్మద్‌గౌస్‌ కునుకు తీయడంతో కారు అదుపుతప్పింది. డివైడర్‌ ఎక్కి అవతలివైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో వరుడు ఫిరోజ్‌బాషా(28), తండ్రి అల్లీసాహెబ్‌(58), పిన్ని రెహనా(40), వదిన జాహిదా(34) ఆమె ఇద్దరు పిల్లలు ఆయాన్‌(6) ఆహిల్‌(4) మరణించారు. మహ్మద్‌గౌస్‌ గాయాలతో బయటపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న బంధువులు, మిత్రులు గుండెలవిసేలా రోదించారు. సంఘటన స్థలాన్ని గుంతకల్లు డీఎస్పీ భాస్కరరెడ్డి పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు