ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు

ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని నల్లా నీరు విషయంలో జరిగిన గొడవను సాకుగా తీసుకొని తాతపై మనవళ్లు దాడిచేసి చంపిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది.

Updated : 20 May 2024 08:17 IST

హసన్‌పర్తి, న్యూస్‌టుడే: ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని నల్లా నీరు విషయంలో జరిగిన గొడవను సాకుగా తీసుకొని తాతపై మనవళ్లు దాడిచేసి చంపిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్సై అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన జల్లి సారయ్య(80), సమ్మక్క దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు చిన్న వయసులోనే చనిపోగా.. పెద్ద కుమారుడు రమేశ్‌ కిడ్నీ సంబంధిత వ్యాధితో తొమ్మిదేళ్ల కిందట మృతి చెందారు. రమేశ్‌ భార్య రమాదేవి(40), కుమారులు సాయికృష్ణ(22), శశికుమార్‌(20) పక్కనే వేరేగా ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సారయ్యకు రెండెకరాల భూమి ఉండగా.. ఇటీవల నాలుగు గుంటలు విక్రయించి, వచ్చిన డబ్బులు కుమార్తెలకు ఇవ్వడంతో కోడలు, మనవళ్లు గొడవపడ్డారు. తమకు రావాల్సిన ఆస్తి కుమార్తెలకు కట్టబెడుతున్నారని అప్పటి నుంచి తరచూ ఘర్షణ పడేవారు. ఆదివారం ఉదయం కుళాయి వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో సారయ్య-సమ్మక్క దంపతులతో కోడలు, మనవళ్లు గొడవకు దిగారు. ఘర్షణ వద్దని వృద్ధుడు వారిస్తున్నా కోడలు వారిపై గట్టిగట్టిగా కేకలు వేయసాగింది. మనవళ్లు వాకింగ్‌ స్టాండ్‌తో తాతపై దాడి చేశారు. బంధువులు, ఇరుగు పొరుగు వచ్చేసరికి అక్కడి నుంచి పారిపోయారు. తల, నుదుటిపై తీవ్రగాయాలతో సారయ్య అక్కడికక్కడే మృతి చెందారు. సమ్మక్క ఫిర్యాదుతో హసన్‌పర్తి పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని