బెంగళూరులో రేవ్‌ పార్టీ.. పట్టుబడ్డ తెలుగు సినీ, బుల్లితెర నటులు!

బెంగళూరు శివారులోని జీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన రేవ్‌ పార్టీపై నగర నేర నియంత్రణ దళం పోలీసులు సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు. ఐదుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు.

Updated : 21 May 2024 09:27 IST

ఐదుగురు నిర్వాహకుల అరెస్టు
పెద్దఎత్తున మాదకద్రవ్యాలు స్వాధీనం​​​
ఓ కారుపై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ‘ఎమ్మెల్యే స్టిక్కర్‌’

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: బెంగళూరు శివారులోని జీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన రేవ్‌ పార్టీపై నగర నేర నియంత్రణ దళం పోలీసులు సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు. ఐదుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించామని, తెలుగు సినీ సహాయ నటులు, తెలుగు- కన్నడ బుల్లితెర నటీమణులు, మోడల్స్, డాన్సర్లు పాల్గొన్నారని సంయుక్త కమిషనర్‌ చంద్రగుప్తా విలేకర్లకు వెల్లడించారు. ‘45 గ్రాముల ఎండీఎంఏ మాత్రలు, కొకైన్‌ తదితర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. 18 లగ్జరీ కార్లను సీజ్‌ చేశాం. పార్టీకి మొత్తం 101 మంది హాజరుకాగా అందులో 30 మంది మహిళలున్నారు. వారిలో 25 మంది యువతులే. వారందరినీ విచారిస్తున్నాం. కొందరు అనుమానితుల రక్త నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపాం. పార్టీలో పాల్గొనేందుకు కొందరు హైదరాబాద్‌ నుంచి విమానాల్లోనూ వచ్చారు. సినీ నటులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు వీరిలో ఉన్నారు.

పోలీసుల దాడి సమయంలో కొందరు మత్తుపదార్థాలను మరుగుదొడ్లు, ఇతర ప్రదేశాల్లో పడేసినట్లు గుర్తించాం. వచ్చినవారంతా మత్తు పదార్థాలను వినియోగించారో లేదో.. పరీక్షల్లో తేలుతుంది. ఈ ఘటనపై ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు’ అని సంయుక్త కమిషనర్‌ పేర్కొన్నారు. ‘సన్‌సెట్‌ టూ సన్‌రైజ్‌ విక్టరీ’ పేరుతో ఆదివారం సాయంత్రం నుంచే ఇక్కడ రేవ్‌పార్టీ మొదలుపెట్టినట్లు తెలిసింది. చెవులు చిల్లులు పడేలా సంగీతంతో హోరెత్తించడంతో స్థానికులు విసిగిపోయి పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు సీజ్‌చేసిన ఓ కారుపై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేరుతో ‘ఎమ్మెల్యే స్టిక్కర్‌’ అతికించి ఉన్నట్లు గుర్తించారు. తెలుగు సినీపరిశ్రమలో పేరున్న ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రేవ్‌ పార్టీలో పాల్గొన్నట్లు ప్రచారం జరగడంతో ఆమె వివరణ ఇచ్చారు. ‘నేను ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నా. ఆ పార్టీలో పాల్గొనలేదు’ అంటూ ఆమె వీడియో విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని