ఆదాయం రూ.కోటి.. ఆస్తి రూ.3.50 కోట్లు!

హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీగా పనిచేస్తూ మంగళవారం చిక్కిన టీ.ఎస్‌.ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల లెక్క తేల్చడంపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దృష్టి సారించింది.

Updated : 23 May 2024 06:17 IST

ఏసీపీ ఉమామహేశ్వరరావు చిట్టా బహిర్గతం
14 రోజుల రిమాండ్‌.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీగా పనిచేస్తూ మంగళవారం చిక్కిన టీ.ఎస్‌.ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల లెక్క తేల్చడంపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దృష్టి సారించింది. 2014 నుంచి మంగళవారం తమకు చిక్కే వరకు ఉమామహేశ్వరరావు ఆదాయ వ్యయాలను ఏసీబీ అధికారులు లెక్కగట్టారు. ఈ పదేళ్లలో ఆయనకు సుమారు రూ.కోటి ఆదాయం సమకూరినట్లు వెల్లడైంది. ఇదే సమయంలో అతడితోపాటు బంధువులు, బినామీల పేరిట ఉన్న స్థిర, చరాస్తుల విలువ రూ.3.51 కోట్లు ఉన్నట్లు తేలింది. బహిరంగ మార్కెట్‌లో ఆ మొత్తం విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉమామహేశ్వరరావును బుధవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అత్తామామల పేరిటే ఎక్కువ రిజిస్ట్రేషన్‌

2014 నుంచి తాను కొనుగోలు చేసిన ఆస్తులను ఎక్కువగా అత్తామామలు, ఇతర బినామీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. శామీర్‌పేటలో 2022లో విల్లా కోసం రూ.50 లక్షలు, 2017లో జవహర్‌నగర్‌ అయ్యప్పనగర్‌కాలనీ సమీపంలో ఓపెన్‌ ప్లాట్‌ కోసం రూ.10 లక్షలు చెల్లించారు. ఘట్‌కేసర్‌ మండలంలో ఓపెన్‌ ప్లాట్‌ కోసం రూ.19.90 లక్షలు, మరో ప్లాట్‌ కోసం రూ.37.54 లక్షలు చెల్లించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో రూ.7.5 లక్షల విలువైన 25 సెంట్ల స్థలాన్ని చోడవరం న్యూ శాంతినగర్‌ కోఆపరేటివ్‌ కాలనీలో రూ.4.8లక్షల విలువైన 240 చ.గ. ప్లాట్‌ను, చోడవరం మండలంలో రూ.32.56 లక్షల విలువైన స్థలాన్ని కొనుగోలు చేశారు.

మరో డీఎస్పీ ఇంట్లో సోదాలు

ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఆస్తుల చిట్టా తేల్చేందుకు చేపట్టిన సోదాల క్రమంలో హైదరాబాద్‌లో మరో డీఎస్పీ ఇంట్లోనూ సోదాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది. బర్కర్‌పురా హౌసింగ్‌బోర్డు కాలనీలోని టీఎస్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) సందీప్‌రెడ్డి ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించారు. వీరిద్దరూ హైదరాబాద్‌ సీసీఎస్‌లో కలిసి పనిచేశారు. అయితే ఉమామహేశ్వరరావుకు సంబంధించిన కేసులో సందీప్‌రెడ్డికి సంబంధం ఉందా? లేదా? అన్న అంశం తేలలేదు.

బెదిరింపులపై ఫిర్యాదులు

కొందరు పోలీసు అధికారులతో కలిసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు అందుకు సంబంధించి అతడి ల్యాప్‌టాప్‌లోని సమాచారాన్ని విశ్లేషించడంలో నిమగ్నమైంది. ఉమామహేశ్వరరావు ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్నప్పుడు తన భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన వారిపై ఫిర్యాదు చేస్తే ఉమామహేశ్వరరావు తననే బెదిరించారని శ్రీనివాసనాయక్‌ అనే వ్యక్తి బుధవారం అనిశాను ఆశ్రయించారు. సాహితీ ఇన్‌ఫ్రా కుంభకోణం కేసులో నిందితుల నుంచి ఉమామహేశ్వరరావు డబ్బు తీసుకొని బాధితులను బెదిరించారని, దీనిపై దర్యాప్తు చేయాలని బాధితుల తరఫు న్యాయవాది కృష్ణకాంత్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని