ఉపాధ్యాయుడి ప్రాణం తీసిన రహదారి గుంత

గుంతల రోడ్డు మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. తాతయ్య వద్ద ఉన్న తన పిల్లలను తీసుకొచ్చేందుకు బయలుదేరిన తండ్రిని పొట్టనపెట్టుకొని.. ఆ కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చింది.

Updated : 23 May 2024 03:52 IST

వినోద్‌కుమార్‌

యద్దనపూడి, న్యూస్‌టుడే: గుంతల రోడ్డు మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. తాతయ్య వద్ద ఉన్న తన పిల్లలను తీసుకొచ్చేందుకు బయలుదేరిన తండ్రిని పొట్టనపెట్టుకొని.. ఆ కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చింది. ఈ ఘటన బాపట్ల జిల్లా యద్దనపూడి-పోలూరు మార్గంలో బుధవారం చోటుచేసుకుంది. యద్దనపూడి మండలం పోలూరు గ్రామానికి చెందిన తాళ్లూరి వినోద్‌కుమార్‌ (38) ప్రకాశం జిల్లా దర్శిలో ఉంటూ కురిచేడు మండలం అలవలపాడులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తన ఇద్దరు పిల్లలు వేసవి సెలవులకు పోలూరులోని తాతయ్య ఇంటికి వెళ్లగా వారిని తీసుకొచ్చేందుకు వినోద్‌కుమార్‌ బుధవారం ద్విచక్ర వాహనంపై దర్శి నుంచి బయలుదేరారు. యద్దనపూడి- పోలూరు మధ్యలోకి వెళ్లగానే అక్కడ రోడ్డుపై ఉన్న గుంత వల్ల బైక్‌ అదుపు తప్పింది. వాహనం ఒక్కసారిగా కిందపడి వినోద్‌కుమార్‌ తల రోడ్డుకు బలంగా తాకింది. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనపై యద్దనపూడి ఎస్సై జీవీ చౌదరి కేసు నమోదు చేశారు. మార్టూరు- పర్చూరు ప్రధాన మార్గమైన ఈ ఆర్‌అండ్‌బీ రోడ్డు అధ్వానంగా మారినా అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదు. ఎస్సై జీవీ చౌదరి స్పందించి బుధవారం గ్రావెల్‌ తోలించి, గుంతలు పూడ్పించారు.

ప్రమాదంలో మృతిచెందిన ఉపాధ్యాయుడు వినోద్‌కుమార్‌


ప్రమాదానికి కారణమైన గుంత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు