బెట్టింగ్‌ పునాదులపై చీకటి సామ్రాజ్యం

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి.. అమాంతం రూ.కోట్లకు పడగలెత్తాడు. క్రికెట్‌ పందేలు, డ్రగ్స్‌ సరఫరాదారులతో సంబంధాల సాయంతో వ్యాపార సామ్రాజ్యాన్ని ఇబ్బడిముబ్బడిగా విస్తరించాడు.

Updated : 23 May 2024 10:30 IST

ఖరీదైన కార్లు, పలు నగరాల్లో విల్లాలు, ఇళ్లు 
రూ.కోట్లకు పడగలెత్తిన రేవ్‌ పార్టీ నిందితుడు వాసు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ (చిట్టినగర్‌): రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి.. అమాంతం రూ.కోట్లకు పడగలెత్తాడు. క్రికెట్‌ పందేలు, డ్రగ్స్‌ సరఫరాదారులతో సంబంధాల సాయంతో వ్యాపార సామ్రాజ్యాన్ని ఇబ్బడిముబ్బడిగా విస్తరించాడు. ఇటీవల సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్‌ పార్టీ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు లంకపల్లి వాసు గురించే ఇదంతా. విజయవాడ ఆంజనేయవాగు సమీపంలోని బ్రహ్మంగారి మఠం వీధికి చెందిన వాసుది సాధారణ కుటుంబమే. తల్లి దోసెలు అమ్మేది. తండ్రి మరణించాడు. వాసుకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. చిన్నప్పటి నుంచి మంచి క్రికెటర్‌గా ఎదగాలన్నది లక్ష్యం. ఆటపై అభిమానమే బుకీగా మార్చింది. క్రికెట్, హాకీ, కబడ్డీ ఇలా ప్రధాన క్రీడల బెట్టింగుల్లో బుకీగా వ్యవహరించేవాడు. బెంగళూరు, చెన్నై, ముంబయి, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి చిత్తూరు, కర్నూలు, తదితర ప్రాంతాల నుంచి బెట్టింగులు నిర్వహించేవాడు. ఇలా పెద్ద సంఖ్యలో పలు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. విజయవాడలోనే దాదాపు 150 మంది పైగా ఉన్నారు. అనంతరం వ్యాపారాలను విస్తరించి హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పబ్‌లు కూడా నిర్వహిస్తున్నాడు. వాసు భార్య, ఇద్దరు కుమార్తెలు విజయవాడలోనే ఉంటారు. అతను మాత్రం ఒకటి, రెండు రోజులు వచ్చి వెళ్తుంటాడు. చుట్టుపక్కల వారు అడిగితే దుబాయ్, బెంగళూరు, మలేసియాలో పనిచేస్తున్నానని చెప్పి నమ్మించేవాడు.

విమానాలు, లగ్జరీ కార్లలోనే ప్రయాణం

ఎక్కడికి వెళ్లినా విమానాల్లోనే తిరిగే వాసుకు రూ.కోటి విలువైన విలాసవంతమైన కార్లు నాలుగు వరకు ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తదితర ప్రాంతాల్లో భారీగా విల్లాలు, ఇళ్లు కొన్నాడు. ఒక్క విజయవాడలోనే రెండు విల్లాలు, ఇళ్లు ఉన్నట్లు తెలిసింది. ముంబయిలో అద్దె భవనంలో ఉంటూ బెట్టింగ్‌ వ్యవహరాలు నడుపుతుంటాడు. విజయవాడలో చాలాసార్లు పెద్దఎత్తున అతని అనుచరులు పోలీసులకు పట్టుబడినా పలుకుబడిని ఉపయోగించి బయటకు తెచ్చేవాడు. బెంగళూరు రేవ్‌పార్టీలో తప్పితే ఇంతవరకు ఎక్కడా పోలీసులకు పట్టుబడలేదు. లాక్‌డౌన్‌ సమయంలో క్రికెట్‌ ఆడుతుండగా వాసు కాలుకు పెద్ద దెబ్బ తగిలింది. ఇటీవలి వరకు చేతి కర్ర సాయంతోనే నడిచేవాడు. మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. గుండె సంబంధిత సమస్యలు రావడంతో స్టంట్‌ వేసినట్లు సమాచారం.


రేవ్‌పార్టీ కేసు.. సీసీబీకి దర్యాప్తు బాధ్యతలు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: బెంగళూరు రేవ్‌పార్టీ కేసును నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) దర్యాప్తు చేస్తుందని డీజీపీ అలోక్‌మోహన్‌ బుధవారం ప్రకటించారు. మాదక ద్రవ్యాల కట్టడి విభాగం అధికారులు వారికి సహకరిస్తారని పేర్కొన్నారు. తొలుత ఈ కేసును ఎలక్ట్రానిక్‌సిటీ ఠాణాకు.. ఆపై హెబ్బగూడి ఠాణాకు బదిలీ చేసినా చివరికి సీసీబీ దర్యాప్తునకే అధికారులు మొగ్గు చూపారు. సీసీబీ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీప్రసాద్‌ను దర్యాప్తు అధికారిగా నియమించారు. స్థిరాస్తి వ్యాపారి వాసు పుట్టినరోజు వేడుకల పేరుతో ఈ నెల 18న సాయంత్రం రేవ్‌పార్టీ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖుల కుటుంబీకులు, సినీ, బుల్లితెర కళాకారులూ కలసి 250 మంది హాజరైనట్లు తేలింది. ఇప్పటికి 101 మందిని గుర్తించగా.. పరారైనవారి వివరాలు సేకరిస్తున్నారు. కార్యక్రమంలో మత్తు పదార్థాల విక్రయం, వినియోగం పెద్ద ఎత్తున జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసుల హిట్‌లిస్ట్‌లో ఉన్న మత్తుపదార్థాల సరఫరాదారు రాజ్‌భావ సరకు సరఫరాలో కీలక భూమిక పోషించాడని సమాచారం. రక్త నమూనాల పరీక్షల నివేదిక కోసం దర్యాప్తు అధికారులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా బెంగళూరు శివార్లలో ఉన్న ఫాం హౌస్‌ల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని నగర పోలీసు కమిషనర్‌ దయానంద్‌ ఆదేశించారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని