కోల్‌కతాలో హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ!

బంగ్లాదేశ్‌ పార్లమెంటు సభ్యుడు మహమ్మద్‌ అన్వర్‌ ఉల్‌ అజీమ్‌ దారుణ హత్యకు గురయ్యారని ఆ దేశ ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.

Published : 23 May 2024 05:22 IST

కోల్‌కతా/ఢాకా: బంగ్లాదేశ్‌ పార్లమెంటు సభ్యుడు మహమ్మద్‌ అన్వర్‌ ఉల్‌ అజీమ్‌ దారుణ హత్యకు గురయ్యారని ఆ దేశ ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. వైద్య చికిత్స కోసం కోల్‌కతా వచ్చిన ఆయన ఈనెల 13వ తేదీ నుంచి అదృశ్యమయ్యారు. దాంతో బెంగాల్‌ పోలీసులు ఈ కేసును రాష్ట్ర సీఐడీకి అప్పగించారు. అన్వర్‌ హత్య విషయం నిర్ధరణ జరిగినా, మృతదేహం ఆచూకీ తెలియాల్సి ఉందని సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అఖిలేశ్‌ చతుర్వేది పేర్కొన్నారు. ఎంపీ కోల్‌కతాకు వచ్చిన విషయం అధికారికంగా తమ దృష్టికి రాలేదని, ఆయన స్నేహితుడు గోపాల్‌ బిశ్వాస్‌ మే 18న అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేస్తేనే తెలిసిందన్నారు. అన్వర్‌ హత్యకు గురై ఉండొచ్చని మే 20న విదేశాంగ శాఖ నుంచి సమాచారం అందిందని ఆయన తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు భారత్, బంగ్లా పోలీసులు శ్రమిస్తున్నారని బంగ్లా హోంమంత్రి వివరించారు. మే 12న కోల్‌కతా శివారులో ఉన్న తన స్నేహితుడు గోపాల్‌ బిశ్వాస్‌ నివాసంలో బసచేసిన ఆయన.. వెంటనే వస్తానంటూ ఇంటి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని