అనిశాకు చిక్కిన భైంసా మున్సిపల్‌ కమిషనర్, బిల్‌ కలెక్టర్‌

నిర్మల్‌ జిల్లా భైంసా మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.వెంకటేశ్వర్లు, బిల్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌లు లంచం తీసుకుంటూ బుధవారం అనిశాకు పట్టుబడ్డారు.

Published : 23 May 2024 05:24 IST

పట్టుబడిన బిల్‌ కలెక్టర్‌ విద్యాసాగర్, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.వెంకటేశ్వర్లు

భైంసా, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా భైంసా మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.వెంకటేశ్వర్లు, బిల్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌లు లంచం తీసుకుంటూ బుధవారం అనిశాకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వి.వి.రమణమూర్తి ఈ వివరాలు తెలిపారు. భైంసాలోని పురాణబజార్‌కు చెందిన రాధేశ్యాం.. 2022లో పురపాలక సంఘం అనుమతులతో వాణిజ్య భవనం నిర్మించుకున్నారు. కాగా ఆ భవన నిర్మాణం అక్రమమంటూ ఈ నెల 16న పురపాలక కమిషనర్‌ తాఖీదు జారీ చేశారు. నిర్మాణాన్ని క్రమబద్ధీకరించాలంటే రూ.30 వేలు ఇవ్వాలని బిల్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌ ద్వారా డిమాండ్‌ చేశారు. లేకుంటే భవనాన్ని కూల్చివేస్తామని బెదిరించారు. దీంతో రాధేశ్యాం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి నుంచి రూ.30 వేల నగదు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వల వేసి కమిషనర్, బిల్‌ కలెక్టర్‌లను పట్టుకున్నారు. కమిషనర్‌ వెంకటేశ్వర్లు 2019లోనూ నర్సంపేటలో ఏసీబీకి చిక్కారు.  

ఇద్దరు మున్సిపల్‌ కమిషనర్ల సస్పెన్షన్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: పొరుగు సేవల ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు మున్సిపల్‌ కమిషనర్లను పురపాలకశాఖ సస్పెండ్‌ చేసింది. ప్రసుతం బాన్సువాడ, తుర్కయాంజిల్‌లో కమిషనర్లుగా పనిచేస్తున్న ఐఎంఏ అలీం, సత్యనారాయణరెడ్డిలను సస్పెండ్‌ చేస్తూ పురపాలకశాఖ డైరెక్టర్‌ డి.దివ్య బుధవారం ఉత్తర్వులిచ్చారు. అలీం గతంలో భైంసాలో, సత్యనారాయణరెడ్డి నిర్మల్‌లో పనిచేసిన సమయంలో పొరుగు సేవల ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని