ల్యాప్‌టాప్‌లో గుట్టు..!

అవినీతి నిరోధక శాఖకు చిక్కిన హైదరాబాద్‌ సీసీఎస్‌ ఆర్థిక నేరాల విభాగం ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాల చిట్టా ఆయన ల్యాప్‌టాప్‌లో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Published : 24 May 2024 06:04 IST

ఉమామహేశ్వరరావు అక్రమాల చిట్టాపై అనిశా దృష్టి
బినామీల పేరుతో ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై లోతుగా ఆరా
8 రోజుల కస్టడీకి కోర్టులో పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: అవినీతి నిరోధక శాఖకు చిక్కిన హైదరాబాద్‌ సీసీఎస్‌ ఆర్థిక నేరాల విభాగం ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాల చిట్టా ఆయన ల్యాప్‌టాప్‌లో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దాన్ని విశ్లేషించడం ద్వారా కీలక సమాచారం లభ్యమవుతుందనే అంచనాతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉండటంతో న్యాయస్థానం అనుమతితో కస్టడీకి తీసుకొని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం 8 రోజుల కస్టడీకి నాంపల్లి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేశారు. గతంలోనూ ఉమామహేశ్వరరావుపై పలు వివాదాలున్నా.. ప్రస్తుతం మాత్రం ‘సాహితీ ఇన్‌ఫ్రా’ మోసం కేసులో ఆయన వైఖరి వల్లే అనిశా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. సుమారు రూ.2 వేల కోట్ల వ్యవహారంతో ముడిపడి ఉన్న ఈ కేసును సుదీర్ఘకాలంగా ఆయన దర్యాపు చేశారు. ఈనేపథ్యంలోనే సాహితీ ఇన్‌ఫ్రా నిర్వాహకుడు బూదాటి లక్ష్మీనారాయణతో అంటకాగి బాధితులకు ఇబ్బందులు సృష్టించారనే ఆరోపణలున్నాయి. ఆయన వేధింపులు తీవ్రం కావడంతోనే బాధితులు విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఉమామహేశ్వరరావుకు సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలను ఏసీబీ పక్కాగా సేకరించి సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సీసీఎస్‌లో తాను దర్యాప్తు చేసిన కేసులకు సంబంధించి కొందరు అధికారులకు వాటాలిచ్చి ఉంటారనే అనుమానాలున్నాయి. సీసీఎస్‌లో ఇతర ఏసీపీలకు లేని పలుకుబడి ఆయనకు ఉండటం ఇందుకు కారణమనే ప్రచారం ఉంది. కొందరు అధికారులతో కలిసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ల్యాప్‌టాప్‌లో మరికొందరి పోలీస్‌ అధికారుల బాగోతాలు బయటపడతాయనే అంచనాలున్నాయి. 

అత్తమామల పేరిటే ఎక్కువ ఆస్తులు

ఉమామహేశ్వరరావు ఇల్లు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాల అనంతరం చర, స్థిరాస్తులకు సంబంధించిన ధ్రువపత్రాలను ఏసీబీ అధికారులు సేకరించారు. 2014 తర్వాత ఉమామహేశ్వరావు అత్తమామల పేరిట స్థలాలు కొన్నట్లు గుర్తించారు. ఘట్‌కేసర్‌ మండలం ఘన్‌పూర్‌లో రూ.19.9 లక్షల విలువైన ఓపెన్‌ ప్లాట్‌ అత్త సుశీల పేరిట రిజిస్టరయి ఉంది. ఇక్కడే 239.54 చదరపు గజాల ప్లాట్‌ను మామ సతీష్‌బాబు పేరిట కొన్నారు. దానికి సుమారు రూ.37.54లక్షలు చెల్లించారు. కూకట్‌పల్లిలో 200 గజాల స్థలాన్ని, శామీర్‌పేటలో 14 గుంటల వ్యవసాయ భూమిని సుశీల పేరిట కొన్నారు. హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని అశోక ఒర్నాట అపార్ట్‌మెంట్స్‌లో 1,385 చదరపు అడుగుల ఫ్లాట్‌ ఆమె పేరిట రిజిస్టర్‌ చేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పినగాడిలో రూ.7.5లక్షల విలువైన స్థలాన్ని మామ సతీష్‌ పేరిట కొనుగోలు చేసినట్లు దస్తావేజులు లభించాయి. ఇదే జిల్లా చోడవరం న్యూ శాంతినగర్‌ కోఆపరేటివ్‌ కాలనీలో రూ.4.8లక్షల విలువైన 240 చదరపు గజాల ప్లాట్‌  సతీష్‌ పేరిట ఉంది. చోడవరం మండలం దొండపూడిలో ఉమామహేశ్వరరావు పేరిట 5.92 ఎకరాల స్థలం ఉంది. అక్కడే మరో 2.2ఎకరాల స్థలాన్ని కొన్నారు. ఇవి కాకుండా శామీర్‌పేటలోని ఆర్‌.ఎస్‌.కన్‌స్ట్రక్షన్‌లో విల్లా కోసం రూ.50లక్షలు చెల్లించినట్లు పత్రాలు లభ్యమయ్యాయి. స్నేహితుడు మదన్‌మోహన్‌ పేరిట జవహర్‌నగర్‌ అయ్యప్పనగర్‌కాలనీలో రూ.10లక్షల ఓపెన్‌ ప్లాట్‌ ఉంది. శామీర్‌పేట మండలం తుర్కపల్లిలో సర్వే నం.530లో వ్యవసాయ భూమి కొన్నారు. అలాగే రూ.3.62లక్షల విలువైన గృహసామగ్రి.. రూ.2.4లక్షల విలువైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు.. రూ.1.4లక్షల విలువైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ లభ్యమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని