నకిలీ పత్తి విత్తనాల తయారీ ముఠా గుట్టురట్టు

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి, బ్రాండెడ్‌ కంపెనీల పేరిట విక్రయిస్తున్న ముఠా గుట్టును అధికారులు శుక్రవారం రట్టు చేశారు.

Published : 25 May 2024 04:55 IST

ఆదిలాబాద్‌లో గోదామును తనిఖీ చేస్తున్న అధికారులు

ఆదిలాబాద్‌ నేర విభాగం, బెజ్జూరు, తాండూరు, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి, బ్రాండెడ్‌ కంపెనీల పేరిట విక్రయిస్తున్న ముఠా గుట్టును అధికారులు శుక్రవారం రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణంలోని రాంనగర్‌ సమీపంలోని హనుమాన్‌నగర్‌లో ప్రధాన రహదారిపై ఉన్న గోదాముపై వ్యవసాయశాఖాధికారులు, పోలీసులు దాడి చేశారు. విత్తనాలకు ఎరుపు రంగు వేసి, ఆరబెట్టి అక్కడే ప్రముఖ కంపెనీల ప్యాకెట్లలో నింపి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. రూ.19 లక్షల సరకును స్వాధీనం చేసుకోవడంతోపాటు గోదామును సీజ్‌ చేశారు. నిందితులు సామ అశోక్‌రెడ్డి, మణికంఠ, అప్పాల రాజేందర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తనిఖీల్లో జిల్లా వ్యవసాయశాఖాధికారులు పుల్లయ్య, శివ, రమేశ్, గ్రామీణ సీఐ ఫణిధర్, మావల ఎస్సై విష్ణువర్ధన్‌ పాల్గొన్నారు. అలాగే కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం సోమిని గ్రామానికి చెందిన తొర్రెం ప్రశాంత్‌ ఇంట్లో దాడులు నిర్వహించి 70 కిలోల నకిలీ బీటీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాణా ప్రతాప్‌ తెలిపారు. మరో ఘటనలో మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎర్రవోతు రాజు ఇంట్లో 25 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని