శిశువు లింగ నిర్ధారణకు.. భార్యపై భర్త కిరాతక దాడి

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ కోసం నిండుచూలాలైన భార్య పొత్తికడుపును కొడవలితో చీల్చిన భర్త పన్నాలాల్‌ (38)కు శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూన్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు జీవితఖైదు విధించింది.

Published : 25 May 2024 06:07 IST

జీవితఖైదు విధించిన కోర్టు

పన్నాలాల్‌

బదాయూన్‌ (యూపీ): గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ కోసం నిండుచూలాలైన భార్య పొత్తికడుపును కొడవలితో చీల్చిన భర్త పన్నాలాల్‌ (38)కు శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూన్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు జీవితఖైదు విధించింది. పోలీసుల కథనం మేరకు.. 2020 సెప్టెంబరులో ఈ దారుణం జరిగింది. ఎనిమిది నెలల గర్భవతి అయిన అనితపై ఆమె భర్త పన్నాలాల్‌ కొడవలితో దాడి చేశాడు. అయిదుగురు అమ్మాయిలకు జన్మనిచ్చాక ఆరోసారి ఆమె గర్భం దాల్చడంతో అబ్బాయి కావాలన్న ఆత్రుతతో భర్త ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అనిత చికిత్స అనంతరం కోలుకున్నా, గర్భస్రావం అనివార్యమైంది. పుట్టకముందే కన్నుమూసిన ఆ శిశువు బాలుడని వైద్యులు నిర్ధారించడం గమనార్హం. హత్యాయత్నంతోపాటు మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె గర్భ విచ్ఛిన్నానికి పాల్పడిన నేరాల కింద పన్నాలాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నాలుగేళ్ల విచారణ అనంతరం దోషి పన్నాలాల్‌కు జీవితఖైదుతోపాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు జడ్జి సౌరభ్‌ సక్సేనా తీర్పు చెప్పారు. కోర్టు తీర్పును స్వాగతించిన అనిత నాలుగేళ్ల నిరీక్షణ అనంతరం తనకు న్యాయం జరిగిందన్నారు. చిన్న కిరాణం దుకాణం నడుపుతూ తన అయిదుగురు కుమార్తెలను పోషిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు