మూడు గంటల వ్యవధిలో తండ్రీకూతుళ్ల మృతి

వరకట్న వేధింపులతో కుమార్తె.. రోడ్డు ప్రమాదంలో ఆమె తండ్రి.. మూడు గంటల వ్యవధిలో మృతి చెందిన విషాద ఘటన గురువారం రాత్రి నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Updated : 25 May 2024 06:13 IST

అదనపుకట్నం వేధింపులతో కుమార్తె ఆత్మహత్య
గుర్తు తెలియని వాహనం ఢీకొని తండ్రి దుర్మరణం

జ్యోతి, రాథోడ్‌ లక్ష్మణ్‌

రెంజల్, నవీపేట, న్యూస్‌టుడే: వరకట్న వేధింపులతో కుమార్తె.. రోడ్డు ప్రమాదంలో ఆమె తండ్రి.. మూడు గంటల వ్యవధిలో మృతి చెందిన విషాద ఘటన గురువారం రాత్రి నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. రెంజల్‌ మండలం వీరన్నగుట్టతండాకు చెందిన రాథోడ్‌ లక్ష్మణ్‌ (52) తన బిడ్డ జ్యోతి (36)ని 15 ఏళ్ల కిందట నవీపేట మండలం అబ్బాపూర్‌ తండాకు చెందిన ప్రకాశ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ సమయంలో రాథోడ్‌ లక్ష్మణ్‌ ఎకరం పొలం కట్నం కింద ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తనకు కొడుకు పుట్టలేదంటూ ప్రకాశ్‌ అబ్బాపూర్‌ తండాకు చెందిన రాణిని నాలుగేళ్ల కిందట రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కొడుకు. ఈక్రమంలో అదనపు కట్నం కింద రూ.5 లక్షలు, ఎకరం భూమి తీసుకురావాలని భర్త ప్రకాశ్, అతని రెండో భార్య, అత్తామామ కలిసి జ్యోతిని వేధింపులకు గురి చేశారు. మనస్తాపానికి గురైన ఆమె ఈ నెల 22న అత్తగారింట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబీకులు తొలుత నవీపేటలోని ఓ ప్రైవేట్‌ దవాఖానాకు, తర్వాత నిజామాబాద్‌ జీజీహెచ్‌కు తరలించారు. ఈ సమాచారాన్ని జ్యోతి తండ్రికి గురువారం తెలిపారు. ఆయన దవాఖానాకు వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను చూసి తల్లడిల్లిపోయారు. ఈ విషయాన్ని తండావాసులకు చెప్పేందుకు తన ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. తండ్రి వెళ్లిన కొద్దిసేపటికే రాత్రి 7 గంటల సమయంలో జ్యోతి కన్నుమూశారు. ప్రయాణంలో ఉన్న రాథోడ్‌ లక్ష్మణ్‌ వాహనాన్ని రెంజల్‌ మండలం కల్యాపూర్‌ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతూ రాత్రి పది గంటల సమయంలో రాథోడ్‌ లక్ష్మణ్‌ మృతిచెందారు. జ్యోతి మృతిపై ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు భర్త ప్రకాశ్, అత్తామామ ఫరెంగిబాయి, సోమ్లా, ప్రకాశ్‌ రెండో భార్య రాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నవీపేట ఎస్సై యాదగిరిగౌడ్‌ తెలిపారు. రాథోడ్‌ లక్ష్మణ్‌ ప్రమాదంపై ఆయన భార్య జమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రెంజల్‌ ఎస్సై సాయన్న తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని