విద్యుత్తు స్తంభం మీద పడి మూడేళ్ల చిన్నారికి విరిగిన కాలు

అవగాహన లేకుండా ఓ వ్యక్తి చేసిన పనికి ఆరుబయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై విద్యుత్తు స్తంభం పడి కాలు విరిగిన ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది.

Updated : 25 May 2024 06:07 IST

గాయపడిన చిన్నారి చైత్ర, విరిగిపడిన విద్యుత్తు స్తంభం

సారంగాపూర్, న్యూస్‌టుడే: అవగాహన లేకుండా ఓ వ్యక్తి చేసిన పనికి ఆరుబయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై విద్యుత్తు స్తంభం పడి కాలు విరిగిన ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది. సారంగాపూర్‌ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌ జిల్లా పెంబి మండలం పస్పుల గ్రామానికి చెందిన మైండ్ల శ్రీను-గంగ దంపతులకు కుమారుడు, కుమార్తె చైత్ర సంతానం. ఉపాధికోసం మూడు నెలల క్రితం సారంగాపూర్‌ మండలం కౌట్ల(బి) గ్రామానికి వలస వచ్చారు. శ్రీను ఇక్కడే పనిచేస్తున్నారు. బంధువుల ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన రాఠోడ్‌ గంగాధర్‌ భారీ మునగ చెట్టు నరికేశాడు. అది విద్యుత్తు తీగలపై పడి దాని బరువుకు పక్కనే ఉన్న స్తంభం విరిగి కింద పడింది. అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న చైత్ర కుడికాలిపై స్తంభం లోహపు క్రాస్‌ఆర్మ్‌ పడి తీవ్రంగా గాయపడింది. వెంటనే నిర్మల్‌ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఎముక పూర్తిగా విరిగిపోయి, నరాలు దెబ్బతిన్నాయని చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని చెప్పడంతో నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అత్యవసర శస్త్ర చికిత్స చేయాలని.. లేదంటే కాలు తీసివేయాల్సి వస్తుందని చెప్పారు. వైద్యచికిత్సకు అయ్యే ఖర్చు కోసం తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. దాతలు సాయం అందించాలని కోరుతున్నారు. ఈ ఘటనకు కారణమైన గంగాధర్‌పై విద్యుత్తు ఏఈ సాయికిరణ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని