మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం

ఏపీలోని  అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం సీలేరు పరిధిలోని పనసబంద పరిసర అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు.

Published : 26 May 2024 03:16 IST

పేలుడు పదార్థం, మందుపాతరల లభ్యం

మావోయిస్టు డంప్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా. చిత్రంలో పోలీసు అధికారులు

పాడేరు, న్యూస్‌టుడే: ఏపీలోని  అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం సీలేరు పరిధిలోని పనసబంద పరిసర అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. శనివారం పాడేరులోని ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కూంబింగ్‌ చేస్తున్న పోలీసులను హతమార్చాలనే ఉద్దేశంతో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ పెట్టిన డంప్‌ను గుర్తించి వెలికితీశామన్నారు. ఇందులో ఆరు స్టీల్‌ క్యారేజ్‌ మందుపాతరలు, పేలుడు పదార్థం, విప్లవ సాహిత్యం ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు 150 మీటర్ల ఎలక్ట్రికల్‌ వైరు, మేకులు, 5 కిలోల ఇనుపనట్లు లభించాయని పేర్కొన్నారు. ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టులకు ఎలా లభించాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని.. జిల్లా పరిధిలో మావోయిస్టులు దాచిన డంప్‌లన్నింటినీ అతి త్వరలో స్వాధీనం చేసుకుంటామన్నారు. గిరిజనులు మావోయిస్టులకు దూరంగా ఉండాలని, వారి కల్లబొల్లి మాటలు నమ్మవద్దని సూచించారు. డంప్‌ వెలికితీసిన జి.మాడుగుల, సీలేరు ఎస్సైలకు అవార్డులు అందజేశారు. చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్‌ శివ కిషోర్, సెబ్‌ సీఐ హిమగిరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని