‘ట్రాక్టర్‌ ఆపే దమ్ముందా.. సంగతి చూస్తా’

గోదావరి తీరంలో యథేచ్ఛగా ఇసుక కొల్లగొడుతుండడమే కాకుండా అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడమే యంత్రాంగం చేసిన తప్పు.

Published : 27 May 2024 05:43 IST

పట్టుకున్న సిబ్బందికి బెదిరింపు
వీఆర్‌ఏను కొట్టి.. దూషించడంపై కేసు

సీతానగరం, న్యూస్‌టుడే: గోదావరి తీరంలో యథేచ్ఛగా ఇసుక కొల్లగొడుతుండడమే కాకుండా అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడమే యంత్రాంగం చేసిన తప్పు. అంతే.. ఇసుక తరలిస్తున్న వ్యక్తి రెచ్చిపోయాడు. వీఆర్‌ఏపై దాడికి దిగాడు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టరును సైతం పట్టుకుపోయాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముగ్గళ్ల వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. వీఆర్వో గోసాల చిన్న, వీఆర్‌ఏ మద్దాల దుర్గారావు పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముగ్గళ్ల నుంచి బొబ్బిల్లంక వరకు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రేవుల వద్ద వీరు కాపలా ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టరును ముగ్గళ్ల వద్ద పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళుతుండగా వాహన యజమాని పాలడుగుల రాము వచ్చి బెదిరించాడు.

‘స్టేషన్‌కు తీసుకెళితే అంతు చూస్తానని.. ట్రాక్టరు ఆపే దమ్ముందా’ అంటూ కులం పేరుతో రెవెన్యూ సిబ్బందిని దూషించాడు. ట్రాక్టరు తాళాలు తీసుకునే ప్రయత్నం చేసిన వీఆర్‌ఏ దుర్గారావును కొట్టి పరుష పదజాలంతో భయభ్రాంతులకు గురిచేశాడు. ట్రాక్టరుకు అడ్డుగా పెట్టిన తమ బైక్‌ల తాళాలు దౌర్జన్యంగా తీసుకుని.. ట్రాక్టరు తమ మీదకు వచ్చేలా పోనివ్వడంతో పక్కకు తప్పుకొని ప్రాణాలు కాపాడుకున్నామని సిబ్బంది చెప్పారు. ఇసుక అక్రమాలను అడ్డుకునే సమయంలో ఇసుకాసురుల నుంచి తమకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల ద్వారా కలెక్టర్‌కు విన్నవించి.. పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. ఫిర్యాదు మేరకు నిందితుడు రాముపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని