రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జి దుర్మరణం

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ సమీప జాతీయ రహదారి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జి సహా ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.

Published : 27 May 2024 05:42 IST

కారు డ్రైవరూ మృత్యువాత

ప్రమాదంలో దెబ్బతిన్న కారు

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ సమీప జాతీయ రహదారి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జి సహా ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ ధాటికి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యాను మీదకు దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న విశ్రాంత జడ్జి వి.మోహన్‌కుమార్‌(65) అక్కడికక్కడే మృతిచెందగా.. కొన ఊపిరితో ఉన్న కారు డ్రైవర్‌ శ్రీను(35)ను వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. మోహన్‌కుమార్‌ ప్రకాశం జిల్లా న్యాయస్థానంలో అదనపు జిల్లా జడ్జిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. విజయనగరం జిల్లా వినియోగదారుల ఫోరం ఛైర్మన్‌గా చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) ఎడ్జ్యూడికేటింగ్‌ అధికారిగా విజయవాడ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయనగరంలో ఉంటున్న మోహన్‌కుమార్‌ కారులో విజయవాడ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కారును ఢీకొన్న బస్సు ఆగకుండా వెళ్లిపోవడంతో గండేపల్లి మండల పరిధిలో పోలీసులు అడ్డుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని