మహారాష్ట్రలో నగల దుకాణంపై ఐటీ దాడులు

మహారాష్ట్ర నాసిక్‌లోని సురానా జ్యువెల్లర్స్‌ దుకాణం, యజమాని కార్యాలయంపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దాడులు జరిపింది. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 27 May 2024 05:30 IST

రూ.116 కోట్ల విలువైన ఆస్తులు సీజ్‌ 

పుణె: మహారాష్ట్ర నాసిక్‌లోని సురానా జ్యువెల్లర్స్‌ దుకాణం, యజమాని కార్యాలయంపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దాడులు జరిపింది. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సురానా జ్యువెలర్స్‌ యాజమాన్యం పన్ను ఎగవేతకు పాల్పడిందనే కారణంతో మే 23 సాయంత్రం నుంచి ఐటీశాఖ దాడులు నిర్వహించి భారీగా నగదును జప్తు చేసింది.   

ఫర్నీచర్‌లో గుట్టలు గుట్టలుగా సొమ్ము

ఐటీ అధికారులకు తొలుత కార్యాలయాలు, ప్రైవేట్‌ లాకర్లలో కొద్దిపాటి నగదు మాత్రమే దొరికింది. అదే సమయంలో సురానా జ్యువెల్లర్స్‌ యజమాని బంధువు విలాసవంతమైన బంగ్లాను తనిఖీ చేయగా అక్కడ లాకర్లలో కూడా డబ్బు కనిపించలేదు. ఈ క్రమంలో అధికారులకు అనుమానం వచ్చి బంగ్లాలో ఉన్న ఫర్నీచర్‌ను బద్దలు కొట్టగా నగదు గుట్టలు గుట్టలుగా బయటపడింది. వెంటనే ఆ నగదును లెక్కించేందుకు సీబీఎస్‌ సమీపంలోని స్టేట్‌ బ్యాంకును ఆశ్రయించారు. శనివారం బ్యాంకుకు సెలవు కావడంతో అధికారులు వెంటనే స్టేట్‌ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జప్తు చేసిన నగదును దాదాపు 14 గంటలపాటు శ్రమించి లెక్కించారు. అంతకుముందు జప్తు చేసిన నగదును ఏడు కార్లలో ట్రాలీ బ్యాగులు, సంచుల్లో పెట్టి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని