రూ.22 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

రాష్ట్రంలోని వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో పోలీసులు 12.32 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. వీటి విలువ మార్కెట్‌లో రూ.21.77 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

Published : 28 May 2024 02:59 IST

కొడంగల్, మిర్యాలగూడ-న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో పోలీసులు 12.32 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. వీటి విలువ మార్కెట్‌లో రూ.21.77 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. పోలీసులు తమకు అందిన సమాచారం మేరకు వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం హస్నాబాద్‌ గ్రామంలో బోయిన ఆశప్ప అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఓ గదిలో 9.72 క్వింటాళ్ల పత్తి విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.16.77 లక్షల వరకు ఉంటుంది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జాఖాన్‌పేట గ్రామానికి చెందిన మునిగారి హన్మయ్య, ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండల ఇడుపులపాడు గ్రామానికి చెందిన వేణుబాయిలు వాటిని తన ఇంట్లో ఉంచారని ఆశప్ప పోలీసులకు తెలిపాడు. విత్తనాలు స్వాధీనం చేసుకుని ఏవో లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొడంగల్‌ ఎస్సై భరత్‌రెడ్డి తెలిపారు. మరోవైపు ఏపీలోని ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామానికి చెందిన పెండ్యాల జగదీశ్వర్‌రావు వద్ద మంచిర్యాల జిల్లాకు చెందిన గునుగుంట్ల వీరమణికంఠ, ముండ్రు మల్లికార్జున్, కోటా సాంబశివరావు, పల్నాడు జిల్లాకు చెందిన గండవల్ల శ్రీరంగ నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు కొనుగోలు చేసి వాటిని వాహనాల్లో తెలంగాణలోని సరిహద్దుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో గత శనివారం నల్గొండ జిల్లా ఈదులగూడెం కూడలిలో సీఐ సుధాకర్‌ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్కడే వాహనం కోసం వేచిచూస్తున్న గండవల్ల శ్రీరంగ పోలీసులను చూసి తన వద్ద ఉన్న నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను విడిచిపెట్టి పరారయ్యాడు. ఇక్కడ పట్టుకున్న 2.60 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని గుర్తించారు. శ్రీరంగతోపాటు వీరమణికంఠ, మల్లికార్జున్, సాంబశివరావును అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించామని, జగదీశ్వర్‌రావు కోసం గాలిస్తున్నామని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు సోమవారం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని