విద్యార్థిని బలిగొన్న రుణయాప్‌

రుణయాప్‌ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

Published : 28 May 2024 04:53 IST

రూ.10 వేల రుణానికి రూ.లక్ష  చెల్లించాలంటూ వేధింపులు
తట్టుకోలేక ఆత్మహత్య

వంశీ 

తాడేపల్లి, న్యూస్‌టుడే: రుణయాప్‌ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. విజయవాడ న్యూగిరిపురానికి చెందిన మురికింటి వంశీ(21) తాడేపల్లి మండలంలోని ఓ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం యాప్‌ ద్వారా రూ.10 వేల రుణాన్ని తీసుకున్నాడు. తర్వాత నగదు చెల్లించినప్పటికీ రూ.లక్ష చెల్లించాల్సిందేనంటూ యాప్‌ నిర్వాహకులు వేధించడం ప్రారంభించారు. ఇంట్లో చెప్పకుండా రుణం తీసుకోవడం.. తిరిగి చెల్లిస్తున్నా ఇంకా చెల్లించాలని పదే పదే ఒత్తిడి చేస్తుండటంతో ఎవరికీ చెప్పుకోలేక మానసిక వ్యథకు గురయ్యాడు. దీంతో ఈ నెల 25న రాత్రి బైక్‌ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆతర్వాత తండ్రి ఏసుదాసు ఫోన్‌కు అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి అంటూ మెసేజ్‌ పంపించాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే గాలింపు చేపట్టగా కృష్ణానది ఒడ్డున బైక్‌ కనపడింది. అప్పటి నుంచి కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం నదిలో ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు తెలుసుకుని వచ్చి చూడగా వంశీదేనని తేలింది. తాపీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఏసుదాసుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన వంశీని కష్టపడి ఇంజినీరింగ్‌ చదివిస్తుంటే రుణయాప్‌ అతడి ప్రాణాలను బలిగొంది. తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని