కుక్కల దాడిలో రైతు మృతి

కుక్కల దాడిలో రైతు మృతి చెందిన విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలంలో చోటు చేసుకుంది.

Published : 28 May 2024 04:54 IST

పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: కుక్కల దాడిలో రైతు మృతి చెందిన విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలంలో చోటు చేసుకుంది. బిత్రపాడు గ్రామానికి చెందిన నీరస శంకరరావు(40) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సోమవారం ఉదయం గ్రామ శివారులోని చెరువు వైపు వెళ్లగా, ఆయనపై అయిదు కుక్కలు దాడి చేసి కాళ్లు, చేతులు, తొడ భాగంలో తీవ్రంగా గాయపరిచాయి. దీంతో కేకలు వేస్తూ శంకరరావు అక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో చినమేరంగి సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య చంద్రమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటిపెద్ద మరణించడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదే మండలంలోని సీమనాయుడువలసకు చెందిన సీర శంకరరావు.. దాసరిపేటకు చెందిన ఆర్‌.లక్ష్మి కుక్క కాట్లతో చినమేరంగి ఆసుపత్రిలో చేరి సోమవారం చికిత్స పొందారు. ఈ నెల 11న వెంకటరాజుపురంలో కుక్కలు దాడి చేయడంతో బంట లక్ష్మీ అనే వృద్ధురాలు సైతం మృతి చెందింది. దీంతో జియ్యమ్మవలస మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని