అమ్మమ్మకు విద్యుదాఘాతం.. కాపాడబోయిన మనవడూ మృతి

దండెంపై దుస్తులు తీయబోయిన అమ్మమ్మ విద్యుదాఘాతానికి గురయ్యారు.. ఆమెను కాపాడబోయి మనవడూ మృత్యువాతపడ్డ విషాదకర సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల గ్రామంలో సోమవారం జరిగింది.

Published : 28 May 2024 05:12 IST

మొగుళ్లపల్లి, న్యూస్‌టుడే: దండెంపై దుస్తులు తీయబోయిన అమ్మమ్మ విద్యుదాఘాతానికి గురయ్యారు.. ఆమెను కాపాడబోయి మనవడూ మృత్యువాతపడ్డ విషాదకర సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం వెంకట్రావుపల్లి(సీ) గ్రామానికి చెందిన ముడతనపల్లి రామలక్ష్మి(60) భర్త కొద్దిరోజుల క్రితం మరణించారు. దీంతో పిడిసిల్లలో ఉంటున్న ఆమె పెద్ద కుమార్తె దుంప రమ ఇటీవల తన ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి ఆవరణలో ఆరేసిన దుస్తులు తీయడానికి వెళ్లిన రామలక్ష్మి దండేన్ని తాకగానే విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇది గమనించిన రమ కుమారుడు సాయిచరణ్(15) అమ్మమ్మను కాపాడేందుకు దండేన్ని తొలగించేందుకు ప్రయత్నించగా అతనూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. విషయం తెలుసుకున్న సీఐ మల్లేశ్‌యాదవ్, ఎస్సై అశోక్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు. విద్యుత్‌ స్తంభం నుంచి సర్వీస్‌ వైరుకు సపోర్టుగా ఉండే ఇనుప తీగను, దండేన్ని ఒకేచోట కట్టి ఉంచారు. ప్రమాదవశాత్తు దండేనికి విద్యుత్‌ సరఫరా కావడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని