రాంచీ బార్‌లో డీజే కాల్చివేత

ఝార్ఖండ్‌ రాజధాని నగరమైన రాంచీలోని ఓ బార్‌లో సోమవారం తెల్లవారుజామున డిస్క్‌ జాకీ (డీజే)ని కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు.

Published : 28 May 2024 05:13 IST

సీసీటీవీలో రికార్డయిన కాల్పుల ఘటన.. మృతిచెందిన డీజే సందీప్‌ (ఎడమవైపు), నిందితుడు అభిషేక్‌ సింగ్‌

రాంచీ: ఝార్ఖండ్‌ రాజధాని నగరమైన రాంచీలోని ఓ బార్‌లో సోమవారం తెల్లవారుజామున డిస్క్‌ జాకీ (డీజే)ని కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒంటిపై నిక్కరుతో ఉండి ముఖం కనిపించకుండా వస్త్రం కప్పుకొన్న ఓ వ్యక్తి రైఫిలుతో బార్‌లోకి ప్రవేశించి అతి సమీపం నుంచి డీజేను ఛాతీపై కాల్చినట్లు అందులో ఉంది. తుపాకీతో కాల్చిన అనంతరం నిందితుడు ఆ ప్రాంతం నుంచి అదృశ్యమయ్యాడు. మృతుణ్ని పశ్చిమబెంగాల్‌కు చెందిన సందీప్‌ ప్రమాణిక్‌గా గుర్తించినట్లు రాంచీ సీనియర్‌ ఎస్పీ చందన్‌కుమార్‌ సిన్హా తెలిపారు. బిహార్‌ పోలీసుల సహాయంతో గయాలోని అలిపుర్‌ పోలీస్‌స్టేషను పరిధిలో నిందితుణ్ని పట్టుకున్నట్లు చెప్పారు. రాంచీకి తెచ్చి అతణ్ని విచారించాక కాల్పులకు దారితీసిన కారణాలు తెలుస్తాయన్నారు. రాంచీలో నివాసముండే అభిషేక్‌ సింగ్‌ అలియాస్‌ విక్కీగా నిందితుణ్ని గుర్తించామని, కాల్పుల అనంతరం అతడు పలు వాహనాలు మారి బిహార్‌కు చేరుకొన్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నామన్నారు. కాల్పులు జరిపినపుడు అతడు తాగి ఉన్నాడని, వీడియోలో ఒక్కడే కనిపిస్తున్నాడని.. ఈ నేరం వెనుక ఇంకెవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నట్లు ఎస్పీ వివరించారు. కాల్పుల ఘటనకు ముందు బౌన్సర్లకు, వినియోగదారులకు మధ్య బార్‌లో గొడవ జరిగిందని.. అందులో విక్కీ కూడా ఉన్నట్లు తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని