అమెరికాలో రోడ్డు ప్రమాదం.. యాదగిరిగుట్ట యువతి మృతి

జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లి.. ఉన్నత చదువు పూర్తి చేసుకుని.. ఉద్యోగ వేటలో ఉన్న యువతి అక్కడే రోడ్డు ప్రమాదంలో అసువులు బాయడం తీవ్ర విషాదం నింపింది.

Updated : 28 May 2024 05:38 IST

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లి.. ఉన్నత చదువు పూర్తి చేసుకుని.. ఉద్యోగ వేటలో ఉన్న యువతి అక్కడే రోడ్డు ప్రమాదంలో అసువులు బాయడం తీవ్ర విషాదం నింపింది. కుటుంబికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన గుడ్ల కోటేశ్వర్‌రావు, బాలమణి దంపతులకు కుమార్తె సౌమ్య(24), కుమారుడు సాయిచరణ్‌ ఉన్నారు. కోటేశ్వర్‌రావు సీఆర్పీఎఫ్‌ మాజీ జవాను. 20 ఏళ్ల క్రితం వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. యాదగిరిపల్లిలో తమ ఇంట్లోనే కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అమెరికాలో ఫ్లోరిడాలోని అట్లాంటిక్‌ విశ్వవిద్యాలయంలో నాలుగు నెలల క్రితం ఎం.ఎస్‌. పూర్తి చేసిన సౌమ్య... అక్కడే ఉద్యోగాన్వేషణలో ఉంది. ఆరు నెలల క్రితం యాదగిరిగుట్టకు వచ్చి నెల రోజులపాటు ఉండి తిరిగివెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి సరకులు కొనడానికి ఓ దుకాణానికి వెళ్లి తిరిగివస్తుండగా సౌమ్యను వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో మృతి చెందిందని సోమవారం ఉదయం ఆమె రూమ్‌మేట్‌ తమకు సమాచారం అందించినట్లు కోటేశ్వర్‌రావు తెలిపారు. మృతదేహాన్ని సొంతంగా తెచ్చుకొనే స్తోమత కూడా తమకు లేదని, స్వదేశానికి రప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలని ఆయన కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు