ముగ్గురు బాలుర ప్రాణాలు తీసిన ఈత సరదా

సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు నదిలో నీటమునిగి మృతి చెందారు. ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 29 May 2024 06:03 IST

గోస్తనీ ఆనకట్ట వద్ద విషాదం

జామి, న్యూస్‌టుడే: సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు నదిలో నీటమునిగి మృతి చెందారు. ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్‌.కోట రూరల్‌ సీఐ ఉపేంద్రరావు తెలిపిన వివరాల మేరకు.. జామి మండల కేంద్రం సమీపంలోని గోస్తనీ నదిలో జాగరం గెడ్డ కలిసే చోట అడ్డుకట్టపై నుంచి ప్రవాహం జలపాతంలా పారుతుంది. జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్‌ ప్రాంతానికి చెందిన ఆరుగురు బాలురు ఈత కొట్టేందుకు మంగళవారం ఉదయమే ఇక్కడికి వచ్చారు. కొంతసేపు నదిలో ఈత కొట్టారు. అనంతరం ఒడ్డుకు చేరుకునే క్రమంలో జి.అనిల్‌(14) ప్రవాహంలోకి జారి పోయాడు. చేయి అందించేందుకు వెళ్లిన షాకిద్‌ ఖాన్‌ (17), అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మహమ్మద్‌ అస్రాఫ్‌ (17) కూడా గల్లంతయ్యారు. దాంతో భయపడిన మిగతా స్నేహితులు.. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారితో పాటు సీఐ ఉపేంద్రరావు, ఎస్సై వీరబాబు, ఎంపీడీఓ తిరుమలరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో నదిలో వెతికించినా ఫలితం లేకపోవడంతో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే నీటిలో మునిగి విగతజీవులుగా మారిన ముగ్గురు బాలురుని వెలికి తీశారు. శవపరీక్ష నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని