భార్యపై కోపంతో బెదిరింపు ఫోన్‌ కాల్‌!

బాంబు బెదిరింపు కేసులో నిందితుడిని హైదరాబాద్‌ నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్టు సమాచారం.

Published : 30 May 2024 05:55 IST

పోలీసుల అదుపులో నిందితుడు 

ఈనాడు, హైదరాబాద్‌: బాంబు బెదిరింపు కేసులో నిందితుడిని హైదరాబాద్‌ నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్టు సమాచారం. రాజధానిలోని ప్రజాభవన్, నాంపల్లి న్యాయస్థానాల్లో బాంబులు అమర్చామంటూ మంగళవారం ఆగంతకులు కంట్రోల్‌రూమ్‌కు ఫోన్‌ చేసి బెదిరించారు. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం రెండుచోట్ల బాంబుస్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించింది. సుమారు 3-4 గంటలపాటు పరిశీలించి పేలుడు పదార్థాలు దొరక్కపోవటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్‌కాల్‌ ఆధారంగా అతడిని మల్కాజిగిరి నియోజకవర్గం సఫిల్‌గూడకు చెందిన శివకుమార్‌ అలియాస్‌ అశోక్‌గా గుర్తించారు. భార్యతో మనస్పర్థలు తలెత్తటంతో ఒంటరిగా ఉంటున్నాడు. పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. గతంలో ద్విచక్రవాహనాలు చోరీ చేశాడు. మంగళవారం మద్యం మత్తులో భార్యకు ఫోన్‌ చేయగా ఆమె స్పందించకపోవటంతో ఆ కోపంలో నగరంలో పలు చోట్ల బాంబులు అమర్చారంటూ పోలీసు కంట్రోల్‌రూమ్‌కు ఫోన్‌ చేసి చెప్పినట్లు దర్యాప్తులో గుర్తించారు. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని