ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌ జిల్లాలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఓ మహిళా మావోయిస్టు ఉన్నారు.

Published : 30 May 2024 03:03 IST

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌ జిల్లాలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఓ మహిళా మావోయిస్టు ఉన్నారు. మద్దేడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి బందేపార అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు బీజాపుర్‌ ఎస్పీ జితేంద్ర యాదవ్‌ తెలిపారు. మద్దేడ్‌ ఏరియా కమిటీ సభ్యుడు బుచ్చన్న మరో 15-20 మంది మావోయిస్టులతో ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అందిన సమాచారంతో మే 27న డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ) బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం 7 గంటల సమయంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు ఎదురుకాల్పులు జరిగాయి. తర్వాత ఆ ప్రాంతంలో పరిశీలించగా మావోయిస్టులు మనీలా పూనెం(28), మంగ్లూ కుడియం(40) మృతదేహాలు కనిపించాయి. మనీలాపై 12కుపైగా హత్యలు, పలు హత్యాయత్నాలు, లూటీ కేసులు ఉన్నాయి. ఆమెపై రూ.8 లక్షల రివార్డు ఉంది. మంగ్లూ కుడియం మద్దేడ్‌ ఏరియా కమిటీ మిలీషియా ప్లాటూన్‌ కమాండర్‌గా ఉన్నారు. అతడిపై రూ.లక్ష రివార్డు ఉంది. ఈ ఘటనతో ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 118కి చేరింది. 

పది మంది లొంగుబాటు 

దంతెవాడ జిల్లాలో ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన 10మంది మావోయిస్టులు ఎస్పీ గౌరవ్‌రాయ్‌ ఎదుట బుధవారం లొంగిపోయారు. వీరంతా ఘర్‌వాపసీ కార్యక్రమంలో భాగంగా లొంగిపోయారు. గతంలో వీరంతా పలు హింసాత్మక, విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నారు. లొంగిపోయిన వారిలో ఓ మహిళ, నలుగురు మైనర్లు ఉన్నారు. 

సుక్మా జిల్లా కేరళపాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి సిమెల్‌ అటవీ ప్రాంతంలో ఓ మహిళా మావోయిస్టును భద్రతా బలగాలు పట్టుకున్నాయి. పోలీసు అధికారుల విచారణ అనంతరం బుధవారం ఆమెను అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని