మూగజీవాల ఉసురు తీశారు!

కొందరి నిర్లక్ష్యం 16 మూగజీవాలను పొట్టనబెట్టుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.

Published : 30 May 2024 03:06 IST

కంటెయినర్‌లో తరలిస్తుండగా 16 ఎద్దుల మృతి 

కంటెయినర్‌లో ఊపిరాడక మృతి చెందిన ఎద్దులు

మఠంపల్లి, న్యూస్‌టుడే: కొందరి నిర్లక్ష్యం 16 మూగజీవాలను పొట్టనబెట్టుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు గాలి చొరబడని కంటెయినర్‌లో 26 ఎద్దులను కుక్కి సూర్యాపేట నుంచి ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరికి తరలిస్తున్నారు. ఇవీ వివరాలు... సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు మంగళవారం ఉదయం కంటెయినర్‌ను పట్టుకున్నారు. అందులోని ఎద్దులను నల్గొండ గోశాలకు తరలించే నెపంతో రోజంతా కాలయాపన చేశారు. ఊపిరాడకుండా అల్లాడుతున్న వాటిని వెంటనే కిందకు దించి, నీరు తాగించడం, మేత వేయడం వంటివి విస్మరించారు.

26 ఎద్దులను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన కంటెయినర్‌ 

నల్గొండలో 9 ఎద్దులను దించి, తిరిగి మట్టపల్లికి వచ్చేశారు. అయితే, బుధవారం ఉదయం 8 గంటలకు 15 ఎద్దులు చనిపోయాయని పశువైద్యాధికారులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి పోస్టుమార్టం చేస్తుండగానే మరోటి ప్రాణాలు విడిచింది. ఇంకోటి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఎద్దులు ఎప్పుడు చనిపోయాయి? బాగా ఉబ్బిపోయి ఉండటానికి కారణాలేంటి? మట్టపల్లి క్షేత్రంలోనే రెండు గోశాలలు ఉండగా నల్గొండకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం ఇవ్వడంలేదు. అయితే, తాము మంగళవారం సాయంత్రం కంటెయినర్‌ను పట్టుకుని, గోశాలకు తరలించామని, అప్పటికే 15 ఎద్దులు చనిపోయాయని, మరో రెండింటి కాళ్లు విరిగాయని, తొమ్మిందింటిని గోశాలలో అప్పగించినట్లు ఎస్సై వీరాంజనేయులు వెల్లడించారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని