శునకాల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి

హైదరాబాద్‌ నగరంలో వీధి కుక్కల కారణంగా మరో చిన్నారి అసువులుబాశాడు. తాజాగా మియాపూర్‌ పరిధిలో ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లిన ఆరేళ్ల బాలుడిపై శునకాలు దాడి చేయడంతో మృతిచెందిన ఘటన బుధవారం వెలుగు చూసింది.

Published : 06 Jun 2024 05:46 IST

హైదరాబాద్‌ మియాపూర్‌ పరిధిలో ఘటన

మియాపూర్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నగరంలో వీధి కుక్కల కారణంగా మరో చిన్నారి అసువులుబాశాడు. తాజాగా మియాపూర్‌ పరిధిలో ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లిన ఆరేళ్ల బాలుడిపై శునకాలు దాడి చేయడంతో మృతిచెందిన ఘటన బుధవారం వెలుగు చూసింది. మియాపూర్‌ సీఐ దుర్గారామలింగప్రసాద్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్త మహబూబ్‌పేట గ్రామానికి చెందిన వీరేశ్, శిరీష దంపతుల కుమారుడు సాత్విక్‌(6) ఒకటో తరగతి చదువుతున్నాడు. సుమారు నాలుగేళ్ల క్రితం తల్లి అనారోగ్యంతో మృతిచెందగా.. తండ్రితో కలిసి నాయనమ్మ దేవమ్మ వద్ద ఉంటున్నాడు. తండ్రి కూలి పనులకు వెళ్లడం, పాఠశాలకు సెలవులు కావడంతో భిక్షాటన చేసుకునే నాయనమ్మతో కలిసి రోజూ ఇంటి నుంచి డంపింగ్‌ యార్డ్‌ మీదుగా ధర్మపురి క్షేత్రం వైపు వెళ్లేవాడు. మంగళవారం నాయనమ్మతో వెళ్లకుండా బయట ఆడుకుంటానని చెప్పి డంపింగ్‌ యార్డ్‌ వద్దే ఆగిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.బుధవారం ఉదయం యార్డు వద్ద  పరిశీలిస్తుండగా సాత్విక్‌ తీవ్ర గాయాలతో విగతజీవిగా కనిపించడంతో భోరున విలపించారు. ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌ టీంతో పరిశీలన చేపట్టిన పోలీసులు బాలుడు శునకాల దాడిలోనే మృతిచెందినట్లు గాయాలను బట్టి తెలుస్తోందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని