రైల్వే అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

లంచం తీసుకుంటూ రెండేళ్ళ క్రితం పట్టుబడ్డ రైల్వే అధికారిపై హైదరాబాద్‌ సీబీఐ విభాగం తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది.

Published : 07 Jun 2024 05:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: లంచం తీసుకుంటూ రెండేళ్ళ క్రితం పట్టుబడ్డ రైల్వే అధికారిపై హైదరాబాద్‌ సీబీఐ విభాగం తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. పూజారి రత్నాకర్‌ సురేశ్‌ దక్షిణ మధ్య రైల్వే విభాగం చీఫ్‌ ఇంజినీర్‌గా ఉన్నప్పుడు 2022 జూన్‌ 29న పట్టుబడ్డారు. ఉప్పల్‌-జమ్మికుంట రైల్వే స్టేషన్ల మధ్య రోడ్‌ ఓవర్‌ వంతెన నిర్మాణంలో కాంట్రాక్టర్‌ను రూ.5 లక్షలు డిమాండు చేశారు. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సీబీఐ విభాగం అధికారులు అప్పట్లోనే సురేశ్‌ను పట్టుకున్నారు. తదుపరి దర్యాప్తులో భాగంగా ఇటీవల ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి పెద్దఎత్తున ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 2012 జనవరి 1 నుంచి 2022 జూన్‌ 29 వరకూ ఆయన రైల్వేశాఖలో పనిచేసిన కాలంలో రూ.5,21,33,628 ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు వెల్లడయింది. దీంతో ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు ఈ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు