కరెంటు స్తంభంపైనే కొడిగట్టిన ప్రాణం

కరెంటు స్తంభంపైకి ఎక్కి పనులు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ఓ ఎలక్ట్రీషియన్‌ అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 10 Jun 2024 05:39 IST

పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ దుర్మరణం

ఆదిలాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కరెంటు స్తంభంపైకి ఎక్కి పనులు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ఓ ఎలక్ట్రీషియన్‌ అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌ గ్రామీణ ఎస్‌ఐ ముజాహిద్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం రాములుగూడకు చెందిన డి.మోతిరాం (38) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆదివారం యాపల్‌గూడ గ్రామంలో విద్యుత్‌ మోటారు కనెక్షన్‌ కోసం ఏబీ స్విచ్‌ను ఆఫ్‌ చేసి ఓ కరెంటు స్తంభంపైకి ఎక్కి పనులు చేస్తున్నారు. అయితే ఆ స్తంభానికి సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా ఆగినప్పటికీ.. త్రీఫేజ్‌ సరఫరా ఉంది. ఆ విషయాన్ని అతను గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురై స్తంభంపైనే మృతి చెందారు. అతను ముందస్తుగా విద్యుత్తు శాఖ అధికారులకు లైన్‌ క్లియరెన్స్‌ (ఎల్‌సీ) కోసం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

విద్యుత్‌ స్తంభంపై మృతదేహం

3 గంటలు స్తంభంపైనే మృతదేహం

సుమారు మూడు గంటల పాటు మోతిరాం మృతదేహం విద్యుత్‌ స్తంభంపైనే ఉంది. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే అతను మృతి చెందాడని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రాములుగూడ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. రూ.10 లక్షల నష్ట పరిహారం, కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చివరకు జూనియర్‌ లైన్‌మెన్, ఇతర అధికారులు రూ.5 లక్షల వరకు పరిహారం ఇస్తామని అంగీకరించినట్లు గ్రామస్థులు తెలిపారు. మోతిరాం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పనులు చేశారని, అతని మృతితో విద్యుత్‌ శాఖకు ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం రూ.5 లక్షలు ఇస్తామని ఆ శాఖ ఎస్‌ఈ జె.ఆర్‌.చౌహాన్, ఏఈ తిరుపతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని