తెదేపా కార్యకర్త దారుణ హత్య

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో తెదేపా కార్యకర్త గిరినాథ్‌ చౌదరి(35) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు.

Published : 10 Jun 2024 05:48 IST

వేట కొడవళ్లతో నరికిన వైకాపా మూకలు
మృతుడి సోదరుడికి తీవ్ర గాయాలు
మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపై ఫిర్యాదు
కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత

వెల్దుర్తి, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో తెదేపా కార్యకర్త గిరినాథ్‌ చౌదరి(35) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. ఆయన సోదరుడు కల్యాణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎన్నికల ప్రచార సమయం నుంచి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య వైరం నెలకొనడంతో పోలీసులు గ్రామంలో బందోబస్తు కూడా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం గిరినాథ్‌ చౌదరి, సోదరుడు కల్యాణ్‌ తమ ఇంటికి వెళ్తుండగా వైకాపా వర్గీయులు వారిపై వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. గిరినాథ్‌ తలపై తీవ్ర గాయమైంది. కల్యాణ్‌కు సైతం దాడిలో గాయపడ్డారు. ఇద్దరినీ వెల్దుర్తి ఆసుపత్రికి తరలిస్తుండగా.. గిరినాథ్‌ మార్గమధ్యలో మృతిచెందారు. కల్యాణ్‌ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య అనంతరం గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. తెదేపా శ్రేణులు వైకాపా వర్గీయులకు చెందిన రెండు గడ్డివాములు, ద్విచక్ర వాహనం కాల్చివేశారు. మృతుడు గిరినాథ్‌కు భార్య భార్గవి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామానికి చెందిన రామకృష్ణ, రమేష్, చిన్నపామయ్య, మధుసూదన్‌రెడ్డి, చక్రపాణిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, పద్మనాభరెడ్డి, తేజేశ్వర్‌రెడ్డి, చైతన్యరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, కంగాటి రాంమోహన్‌రెడ్డితో పాటు మరికొందరు కారణమని మృతుడి తండ్రి రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

గ్రామంలో బందోబస్తు 

గ్రామంలో హత్య గురించి తెలుసుకున్న కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్‌ బొమ్మిరెడ్డిపల్లికి చేరుకుని పరిశీలించారు. తిరిగి ఎలాంటి దాడులు జరగకుండా బందోబస్తు చేపట్టాలని ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డికి సూచించారు. హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. గిరినాథ్‌ చౌదరి మృతదేహాన్ని వెల్దుర్తి సీహెచ్‌సీకి తరలించారు. ఆయన కుటుంబ సభ్యులను తెదేపా నాయకులు పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని