కౌన్సిలర్.. నా చావుకు కారణం నువ్వే!
రెండు పడకగదుల ఇల్లు రాకుండా అధికార పార్టీ కౌన్సిలర్ అడ్డుకుంటున్నాడనే ఆవేదనతో ఓ ఆటో డ్రైవర్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
రెండు పడక గదుల ఇల్లు రాలేదన్న ఆవేదనతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
సిద్దిపేటలో కలకలం
సిద్దిపేట, సిద్దిపేట టౌన్, కొండపాక-న్యూస్‌టుడే: రెండు పడకగదుల ఇల్లు రాకుండా అధికార పార్టీ కౌన్సిలర్ అడ్డుకుంటున్నాడనే ఆవేదనతో ఓ ఆటో డ్రైవర్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకొని కౌన్సిలర్ పేరును ప్రస్తావించారు. దాన్ని స్నేహితుల వాట్సప్ గ్రూపులో పోస్టు చేశారు. సోమవారం సాయంత్రం సిద్దిపేట కలెక్టరేట్ ఆవరణలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేటలోని 26వ వార్డు పరిధి గణేశ్‌నగర్‌కు చెందిన శిలాసాగర్ రమేశ్(36) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అతని భార్య లలిత గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పొరుగు సేవల కింద జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి పదేళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. రెండు పడకగదుల ఇల్లు మంజూరు విషయంలో తనకు న్యాయం చేయాలని కోరేందుకు సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణికి బయల్దేరిన రమేశ్.. సాయంత్రం కలెక్టరేట్ భవనం వెనుక పార్కింగ్ ప్రాంతంలో అపస్మారక స్థితిలో కనిపించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సిద్దిపేట సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రమేశ్ మృతి చెందారు. పోలీసులు విచారణ చేపట్టారు.
తాగుతున్నా..చూడు: ‘ఇంకెన్ని చేస్తవో చెయ్యండి. తాగుతున్నా చూడు. డీజిల్ కూడా తెచ్చుకున్నా. పోసుకొని అంటవెట్టుకుంటా. లైటర్ కూడా తెచ్చుకున్న. నేను ఒక్కదాంతో చావను. మొండిఘటాన్ని. నా చావుకు కారణం నువ్వే. నా జీవితంతో చెలగాటం ఆడాలనుకున్నావు. నీకు ఆ ఛాన్సు ఇవ్వను. ఇవ్వాళ ఈ పనిచేసుకుంటున్నా. ఎట్ల తాగుతున్ననో చూడు.. ప్రవీణ్ కౌన్సిలర్ సెలవు’ అని 1.41 నిమిషాల వీడియోను రమేశ్ వాట్సప్ గ్రూపులో పోస్టు చేశారు. అందులో మరో స్థానిక నాయకుడినీ తీవ్రంగా దూషించారు. రమేశ్ భార్య లలిత, సోదరుడు వేణు మాట్లాడుతూ.. ఇల్లు మంజూరైనట్లు నాలుగుసార్లు జాబితాలో పేరు వచ్చినా కౌన్సిలర్ అడ్డుకున్నారని, తమది పేద కుటుంబమని వాపోయారు. బంధువు సంతోష్ మాట్లాడుతూ.. లలితకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కౌన్సిలర్ కక్ష పెంచుకున్నారన్నారు. సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ విజయసాగర్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. ఇటీవల రూపొందించిన ఇళ్ల లబ్ధిదారుల జాబితాలోని కొందరికి.. అభ్యంతరాల మేరకు కేటాయించలేదని, పునఃపరిశీలన అనంతరం చర్యలు తీసుకుంటామని వివరించారు. రాత్రి వరకు తమకు ఫిర్యాదు అందలేదని త్రీ టౌన్ పోలీసులు తెలిపారు.
నాకు ఎలాంటి సంబంధం లేదు
కౌన్సిలర్ ప్రవీణ్
ఆటో డ్రైవర్ రమేశ్ రెండు పడక గదుల ఇల్లు మంజూరు విషయమైనా.. ఆత్మహత్య అంశమైనా నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను డబ్బులు డిమాండ్ చేశానని ఆరోపిస్తున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. పైరవీ చేయలేదు. నా వార్డు పరిధిలో ఉపాధి కల్పించే అంశంలో ఎవరికైనా సాయం చేశానే తప్ప హాని తలపెట్టలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kotamreddy: కాసేపట్లో మళ్లీ మీడియా ముందుకు కోటంరెడ్డి
-
Crime News
కారులో మంటలు.. గర్భిణి, భర్త సజీవదహనం
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
12 మంది భార్యలు.. సెంచరీ దాటిన పిల్లలు!
-
Politics News
మాజీ మంత్రి ముత్తంశెట్టికి చుక్కెదురు.. రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన