రహదారులపై రక్తధారలు

Eenadu icon
By Crime News Desk Updated : 04 Nov 2025 06:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

రాష్ట్రంలో 3 ప్రమాదాలు.. ఏడుగురి దుర్మరణం
బాపట్ల జిల్లాలో నలుగురి మృత్యువాత 
మృతులు ఎమ్మెల్యే నరేంద్రవర్మ బంధువులు 
అనకాపల్లి జిల్లాలో ఇద్దరి మృతి 
ఏలూరు జిల్లాలో మరో యువకుడు..
మూడు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం
23 మందికి గాయాలు 

బాపట్ల జిల్లా సత్యవతిపేట సమీపంలో ప్రమాదానికి గురైన కారు

బాపట్ల, కర్లపాలెం, ఎలమంచిలి గ్రామీణం, లింగపాలెం, చింతలపూడి, న్యూస్‌టుడే: సాఫీగా సాగాల్సిన ప్రయాణాల్లో అనూహ్య ప్రమాదాలు... నెత్తుటి ధారలతో తడిచిన రహదారులు... ఆత్మీయులను కోల్పోయిన కుటుంబసభ్యుల రోదనలు... వెరసి రాష్ట్రంలో సోమవారం చోటుచేసుకున్న మూడు వేర్వేరు ప్రమాదాలు ఏడుగురిని పొట్టన పెట్టుకోగా 23 మంది గాయపడ్డారు. 

సంగీత్‌ వేడుకలకు వెళ్లొస్తూ... 

బాపట్ల జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రొయ్యల కంటెయినర్‌ను కారు ఢీకొని నలుగురు దుర్మరణం చెందారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ కుమారుడు రాకేష్‌వర్మ సంగీత్‌ వేడుకలను ఆదివారం బాపట్లలో నిర్వహించారు. కర్లపాలెం గ్రామం నుంచి కొందరు బంధువులు హాజయ్యారు. వేడుకలు పూర్తయ్యాక తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు.. 216ఏ జాతీయ రహదారిపై సత్యవతిపేట సమీపంలో ఎదురుగా వస్తున్న రొయ్యల కంటెయినర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బేతాళం బలరామరాజు(65), ఆయన సతీమణి లక్ష్మి(60), వియ్యపురాలు గాదిరాజు పుష్పవతి(60) అక్కడికక్కడే మృతిచెందారు. కారు నడుపుతున్న ముదునూరి శ్రీనివాసరాజు(54)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. శ్రీనివాసరాజు స్వస్థలం విజయవాడలోని ముత్యాలంపాడు. ప్రమాదంలో బలరామరాజు మనవడు జయంత్‌వర్మ, మనవరాలు వైష్ణవికి గాయాలయ్యాయి. వీరిని గుంటూరు, చీరాలలోని ఆసుపత్రులకు తరలించారు.  


లారీని తప్పించబోయి.. ఆటోను ఢీకొట్టి..

అనకాపల్లి జిల్లాలో సంభవించిన ప్రమాదంలో  దెబ్బతిన్న ఆటో, టాటా మ్యాజిక్‌ వాహనాలు  

చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లి కూడలిలో ఆగి ఉన్న ఆటోను టాటా మ్యాజిక్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 12 మందికి గాయాలయ్యాయి. తాళ్లపాలెం నుంచి ప్రయాణికులతో బయల్దేరిన ఆటో డ్రైవర్‌.. ఎలమంచిలిలోని ప్రేమసమాజం వద్ద ఇద్దరిని దించారు. వారి నుంచి ఛార్జీ డబ్బులు తీసుకుంటున్నారు. ఆ సమయంలో ఆటో పక్కగా లారీ వెళ్తుండగా.. దాని వెనక టాటా మ్యాజిక్‌ వాహనం వస్తోంది. లారీని తప్పించే ప్రయత్నంలో మ్యాజిక్‌ వాహనం.. నిలిపి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఆటోలోని ఎనిమిది మందికి గాయాలు కాగా.. కశింకోట మండలం తీడ గ్రామానికి చెందిన గొంది పెంటయ్య (55), నర్సీపట్నానికి చెందిన బాదంపూడి లక్ష్మి మృతి చెందారు. మ్యాజిక్‌ వాహనంలోని పది మందిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.  

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన హోంమంత్రి అనిత 

గాయపడిన మహిళను వాహనంలోకి ఎక్కించేందుకు తీసుకొస్తున్న హోంమంత్రి అనిత

విశాఖపట్నం నుంచి పాయకరావుపేట వస్తున్న హోంమంత్రి అనిత.. ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్‌ను ఆపారు. సిబ్బంది సాయంతో క్షతగాత్రులను వాహనాల్లోకి ఎక్కించి హుటాహుటిన ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గాయపడిన వారికి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌తో కలిసి వైద్యులతో మాట్లాడి.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తీవ్రగాయాలైన ఎనిమిది మందికి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిని అనకాపల్లి జిల్లా ఆసుపత్రి, విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. 


బైక్‌ను ఢీకొని ప్రైవేటు బస్సు బోల్తా 

ప్రవీణ్‌బాబు 

ఏలూరు జిల్లా లింగపాలెం సమీపంలోని జూబ్లీనగర్‌ వద్ద సోమవారం రాత్రి ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బైక్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇటీవలే సాఫ్ట్‌వేర్‌ కొలువు దక్కించుకుని విధుల్లో చేరేందుకు హైదరాబాద్‌ ప్రయాణమైన వీరంకి ప్రవీణ్‌ బాబు(25) అనే యువకుడు మరణించాడు. బస్సు ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన బయటకు దూకి ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నంలో బస్సు కిందపడి చనిపోయినట్లుగా భావిస్తున్నారు. అయ్యపరాజుగూడేనికి చెందిన ప్రవీణ్‌బాబు ఇటీవల రూ.20 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం దక్కించుకున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. వీరిని చింతలపూడి, ఏలూరు ఆసుపత్రులకు తరలించారు. ధర్మాజీగూడెం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఈ బస్సు.. బయలుదేరిన కాసేపటికే ప్రమాదానికి గురైంది. జూబ్లీనగర్‌ వద్ద వెళ్తున్న బైక్‌ను పక్క నుంచి బస్సు ఢీకొట్టి సుమారు 400 మీటర్లు దూరం ముందుకు దూసుకెళ్లి అక్కడ మలుపు వద్ద బోల్తాపడింది. డ్రైవర్‌ ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. డ్రైవర్, క్లీనర్‌ సహా 17 మంది బస్సులో ఉన్నారు.  

బోల్తాపడిన బస్సు

Tags :
Published : 04 Nov 2025 06:43 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు