Archana Nag : నా దగ్గర ఎక్స్‌క్లూజివ్‌ సాక్ష్యాలున్నాయ్‌.. షేక్‌ చేస్తా : అర్చనా నాగ్‌

తన అందంతో ప్రముఖులను ముగ్గులోకి దించి(Honey trap) వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న చిత్రాలు, వీడియోలు చూపించి పెద్ద మొత్తంలో డిమాండ్‌ చేసిన వ్యవహారంలో అరెస్టయిన ఒడిశా వగ‘లేడీ’ అర్చనా నాగ్‌(Archana Nag)ను ఈడీ(ED) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

Published : 07 Dec 2022 01:05 IST

భువనేశ్వర్‌: తన అందంతో ప్రముఖులను ముగ్గులోకి దించి(Honey trap) వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న చిత్రాలు, వీడియోలు చూపించి పెద్ద మొత్తంలో డిమాండ్‌ చేసిన వ్యవహారంలో అరెస్టయిన ఒడిశా మహిళ అర్చనా నాగ్‌(Archana Nag)ను ఈడీ(ED) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ కోసం ఈడీ కార్యాలయానికి తరలించడానికి ముందు వైద్య పరీక్షల కోసం ఝార్పాడ ప్రత్యేక జైలు నుంచి భువనేశ్వర్‌లోని క్యాపిటల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెకు పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన వద్ద రాష్ట్రాన్ని షేక్‌ చేసే విధంగా ఎక్స్‌క్లూజివ్‌ సాక్ష్యాలు ఉన్నాయని.. ఈడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరించనున్నట్టు చెప్పింది. ఈడీ కస్టడీలో విచారణ కోసమే తాను ఎదురుచూస్తున్నానని.. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొంది. ‘‘నాకు మాట్లాడటానికి తగినంత సమయం కావాలి. కనీసం 30 నిమిషాలైనా అవసరం. నేను మాట్లాడితే రాష్ట్రంలో మొత్తం సీన్‌ మారిపోతుంది. నన్ను ట్రాప్‌లో పడేశారు. ఎక్స్‌క్లూజివ్‌ ఆధారాలు నా వద్ద ఉన్నాయి. ఎవరినీ వదిలిపెట్టను‘‘ అని వ్యాఖ్యలు చేసింది.

తనను అరెస్టు చేసిన తీరుపైనా ఆమె కమిషనరేట్‌ ఆఫ్‌ పోలీసులకు వ్యతిరేకంగా పలు విమర్శలు చేసింది. తానేమీ ఉగ్రవాదిని కాదని.. కమిషనరేట్‌ పోలీసులు అరెస్టు చేసిన తీరు, తన కుటుంబాన్ని వేధించిన పద్ధతి చూస్తుంటే ఇదంతా తనపై కుట్రలా ఉందని ఆరోపించింది. మరోవైపు, సెక్స్‌ రాకెట్‌తో పాటు ధనవంతులను బ్లాక్‌మెయిల్‌ చేయడం ద్వారా భారీగా కూడబెట్టిన సంపదకు సంబంధించి మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆమెను ఏడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. డిసెంబర్‌ 13న తిరిగి ఆమెను జిల్లా సెషన్సు కోర్టులో హాజరుపరుస్తారు. ఇప్పటివరకు ఈ కేసులో తొమ్మిది మందిని విచారించిన ఈడీ.. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న ఆమె భర్త జగబంధు చంద్‌ను డిసెంబర్‌ 7న కోర్టు ముందు హాజరుపరచనుంది. 2018 నుంచి కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే భువనేశ్వర్‌లోని సత్యవిహార్‌లో మూడంతస్తుల విశాలమైన బంగ్లాతో పాటు రూ.30కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు అర్చనా నాగ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా ఆమెను అక్టోబర్‌ 6న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని