UP Gangster: నా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టొద్దు.. ప్లీజ్‌ : యూపీ గ్యాంగ్‌స్టర్‌ మొర

గుజరాత్‌లోని సబర్మతి కేంద్ర కారాగారంలో ఉన్న నిందితుడు అతీక్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు మరోసారి అతడిని తరలించారు.

Published : 13 Apr 2023 02:04 IST

లఖ్‌నవూ: ‘నా పని అయిపోయినట్లే.. కానీ, దయచేసి నా కుటుంబాన్ని మాత్రం ఇబ్బందులకు గురిచేయవద్దు’ అని యూపీ గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ మొరపెట్టుకున్నాడు. ఓ కేసు విచారణ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కోర్టుకు తరలిస్తున్న సమయంలో పోలీసు వ్యానులో నుంచే విలేకర్లతో మాట్లాడాడు. మాఫియాలను మట్టిలో కలిపేస్తామని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ చేసిన హెచ్చరికలు అతీక్‌ అహ్మద్‌ మదిలో మెలగడం వల్లే ఇలా ప్రాధేయపడి ఉండవచ్చని భావిస్తున్నారు.

గుజరాత్‌లోని సబర్మతి కేంద్ర కారాగారంలో ఉన్న నిందితుడు అతీక్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు మరోసారి అతడిని తరలించారు. మార్గమధ్యలో ఉన్న సమయంలో ఓ చోట కాన్వాయ్‌ ఆగింది. అదే సమయంలో పోలీసు వ్యానులో ఉన్న నిందితుడు కాన్వాయ్‌ని ఫాలో అవుతున్న మీడియా బృందాన్ని చూశాడు. ‘మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. నాపని అయిపోయింది. కానీ, దయచేసి మా ఇంట్లో మహిళలు, చిన్నారులను మాత్రం ఇబ్బందులకు గురిచేయవద్దు’ అని వేడుకోవడం కనిపించింది. అంతకుముందు కూడా ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు తనను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకేసులో అతీక్‌ అహ్మద్‌ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. 2019 నుంచి సబర్మతి జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిపై సుమారు 100కుపైగా క్రిమినల్‌ కేసులున్నాయి. అయితే, ఎమ్మెల్యే రాజుపాల్‌ కేసులో ప్రధానసాక్షిగా ఉన్న ఉమేశ్‌పాల్‌ ఇటీవల హత్యకు గురయ్యాడు. ఆయనతోపాటు ఇద్దరు అంగరక్షకులను పట్టపగలే కాల్చి చంపడం యూపీలో ఇటీవల సంచలనం సృష్టించింది. అటు ఉమేశ్‌పాల్‌ను హత్య చేసినట్లు భావిస్తోన్న ఓ వ్యక్తి కూడా ఇటీవల (మార్చి నెలలో) జరిగిన పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఈ కేసులో అతీక్‌ అహ్మద్‌పైనా కేసు నమోదయ్యింది. పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అతీక్‌ను కేసు విచారణ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌ కోర్టుకు తరలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని