UP: ఎలుక తోకకు రాయికట్టి చంపిన కేసు.. వ్యక్తిపై 30 పేజీల ఛార్జిషీట్‌!

ఓ ఎలుక తోకకు రాయి కట్టి, దాన్ని నీళ్లలో ముంచి చంపేసిన కేసులో వ్యక్తిపై పోలీసులు కోర్టులో 30 పేజీల ఛార్జిషీటు దాఖలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూలో ఈ వ్యవహారం నమోదైంది.

Published : 11 Apr 2023 19:43 IST

లఖ్‌నవూ: ఓ ఎలుక (Rat)తో క్రూరంగా ప్రవర్తించి, దాని మరణానికి కారణమైన వ్యక్తిపై యూపీ పోలీసులు (UP Police) ఛార్జిషీట్‌ దాఖలు చేసిన వ్యవహారం ఇది. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ రిపోర్టు, వీడియోలు, వివిధ విభాగాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పూర్తిస్థాయి ఛార్జిషీట్‌ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఆ ఎలుక ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరి, ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడి కావడం గమనార్హం.

గతేడాది నవంబర్‌లో మనోజ్ కుమార్ అనే వ్యక్తి.. ఓ ఎలుక తోకకు రాయి కట్టి మురుగు కాల్వలోకి విసిరాడు. ఇది చూసిన జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర శర్మ.. జంతువు పట్ల అతను క్రూరంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలుకను కాపాడేందుకు ప్రయత్నించానని, అయితే అది అప్పటికే చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 429తోపాటు జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు.. శవపరీక్ష నిమిత్తం ఎలుక కళేబరాన్ని తొలుత బదాయూలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించగా వారు నిరాకరించారు. అనంతరం దాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐవీఆర్‌ఐ)కు తీసుకెళ్లారు. పరీక్షించిన ఫోరెన్సిక్‌ నిపుణులు.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా అది చనిపోయినట్లు తేల్చారు. ఈ క్రమంలోనే యూపీ పోలీసులు తాజాగా బదాయూ కోర్టులో నిందితుడిపై 30 పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేశారు.

అయితే.. కుమార్‌ తండ్రి దీన్ని ఖండించారు. అతని మట్టి పాత్రలను ఎలుకలు పాడు చేశాయని.. దీంతో అతను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ‘ఈ కేసులో దోషిగా తేలితే జంతు హింస నిరోధక చట్టం కింద గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఐపీసీ సెక్షన్ 429 కింద ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉంది’ అని ఓ సీనియర్‌ న్యాయవాది తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని