AP News: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల సమాచారం చోరీ!

వైకాపా హయాంలో ఐటీ సలహాదారులుగా పనిచేసిన వారిలో కొందరు గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన సమాచార (డేటా) చౌర్యానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.

Updated : 06 Jun 2024 09:20 IST

సెక్రటేరియట్‌లోని ఐటీ విభాగంలో పోలీసుల తనిఖీలు 

ఈనాడు, అమరావతి: వైకాపా హయాంలో ఐటీ సలహాదారులుగా పనిచేసిన వారిలో కొందరు గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన సమాచార (డేటా) చౌర్యానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. సచివాలయాలకు సంబంధించిన గత ఐదేళ్ల సమాచారం దొంగతనానికి గురయినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. విలువైన డేటాను ఇప్పటికే గుట్టుగా రాష్ట్రం దాటించేశారని అంచనా వేస్తున్నారు. డేటా చౌర్యంపై పోలీసు శాఖలోని ఐటీ విభాగానికి ఫిర్యాదు అందడంతో.. సంబంధిత అధికారులు సచివాలయంలోని ఐటీ శాఖ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం తనిఖీలు నిర్వహించారు. ఐటీ శాఖ పరిధిలోని సర్వర్‌ నుంచి ఏమైనా డేటా చౌర్యం జరిగిందా? ఏమైనా ఫైళ్లు ట్యాంపర్‌ చేయడానికి ప్రయత్నించారా అని ఆరా తీశారు. ఐటీ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఉపకరణాలను కూడా పరిశీలించారు. ఉద్యోగుల నుంచి పెన్‌డ్రైవ్‌లు, డేటా హార్డ్‌డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సర్వర్‌లో ఉన్న సమాచారాన్ని తొలగించడానికి ఏమైనా ప్రయత్నం జరిగిందా అని పరిశీలించారు. సమాచార చౌర్యం విషయాన్ని గుర్తించిన వెంటనే ఐటీశాఖ సచివాలయాల శాఖ వినియోగించే లాగిన్లను నిలిపేయాలని అధికారులను సూచించింది. తమ పర్యవేక్షణలో ఉన్న సర్వర్‌ను కూడా నిలిపివేసింది.

ముఖ్య ఫైళ్ల ట్యాంపరింగ్‌కు అవకాశం?

సచివాలయాల సమాచారం దొంగిలించారని తెలియడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ శాఖలు వినియోగించే ‘ఈ-ఆఫీస్‌’ లాగిన్‌లను ఐటీ శాఖ డిజేబుల్‌ చేసింది. పాత ఫైళ్లలో మార్పులు చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుందని ముందస్తు జాగ్రత్తగా లాగిన్లను నిలిపేసింది. సీఎం పేషీ, మంత్రుల పేషీ, లాగిన్‌లను కూడా ఐటీ శాఖ డిజేబుల్‌ చేసింది. గనులు, ఎక్సైజ్, ఆర్థిక శాఖలకు సంబంధించిన కీలకమైన ఫైళ్ల ట్యాంపరింగ్‌ జరిగే అవకాశం ఉందని భావించి.. లాగిన్లను వెంటనే నిలిపివేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది.  

కీలక సమాచారం ‘క్లౌడ్‌లో’ ఎందుకు ఉంచినట్లు?

ప్రభుత్వ విభాగాలు రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన సాంకేతిక సేవలను ఐటీ శాఖ నుంచి తీసుకుంటున్నాయి. ఆయా శాఖల సమాచారం మొత్తం ఐటీ శాఖ సర్వర్లలో భద్రంగా ఉంటోంది. కానీ, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన వైకాపా ప్రభుత్వం.. ఆ శాఖ ద్వారా అందించే సేవల కోసం సుమారు 90 శాతం సాంకేతికతను క్లౌడ్‌ విధానంలో తీసుకుంది. వాటికి సంబంధించిన సమాచారం.. ఐటీ శాఖ సర్వర్‌కు అనుసంధానం కాదు. దీంతో సులువుగా డేటా చౌర్యం చేయడానికి అవకాశం ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని