Robbery: వెబ్‌సిరీస్‌ చూసి.. వ్యాపార దంపతులను హత్య చేసి..!

వెబ్‌సిరీస్‌ చూసి ఓ ఇంట్లో దోపిడీకి యత్నించిన ఇద్దరు యవకులు.. అక్కడ దంపతులను హత్య చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 12 Aug 2023 21:35 IST

లఖ్‌నవూ: ఓ ఇంట్లో చోరీకి యత్నించిన ఇద్దరు యువకులు.. ప్రతిఘటించిన దంపతులను హతమార్చారు. అయితే, ఓ వెబ్‌సిరీస్‌ చూసి ఈ నేరానికి పాల్పడినట్లు నిందితులు చెప్పడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాపారవేత్త ధన్‌కుమార్‌ జైన్‌(70), ఆయన భార్య అంజు జైన్‌(65) కుటుంబం మేరఠ్‌లో నివసిస్తోంది. గురువారం ఇద్దరు యువకులు వారి ఇంట్లోకి చొరబడి దోపిడీకి యత్నించగా.. దంపతులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలోనే నిందితులు వారిపై దాడి చేసి.. డబ్బు, నగలతో పరారయ్యారు. తీవ్ర గాయాలతో ధన్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన భార్య మృతి చెందారు.

దర్జాగా బ్యాంకులోకి వచ్చి.. 5 నిమిషాల్లో రూ.14లక్షలు దోచుకుని..!

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నిందితులను ప్రియాంక్‌ శర్మ(25), యశ్‌ శర్మ(24)ను అరెస్టు చేశారు. ప్రియాంక్‌.. ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడని, యశ్‌ 8వ తరగతికే చదువు మానేసి, బ్యాటరీల దుకాణంలో పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. ఓ వెబ్‌సిరీస్‌ చూసి ఇదంతా చేశామని, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యూట్యూబ్‌లో మార్గాలనూ వెతికినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. 

‘గుర్తుపట్టకుండా ఉండేలా నిందితులు.. గ్లౌజులు, మాస్కులు, హెల్మెట్‌ ధరించడంతోపాటు బైక్‌ నంబర్‌ ప్లేట్‌ కూడా మార్చేశారు. సీసీటీవీ కెమెరాలను తప్పించుకునేందుకు యత్నించారు. అయితే, చోరీకి ఒకరోజు ముందు.. అద్దె ఇల్లు పేరిట ఆ నిందితులు ధన్‌కుమార్‌ ఇంటికి వెళ్లారు. ఈ ఆధారాలతోపాటు సీసీటీవీ ఫుటేజీలు, ఎలక్ట్రానిక్‌ నిఘా తదితర సమాచారంతో నిందితులను పట్టుకున్నాం. చోరీ సొత్తుతోపాటు తుపాకీ, బైక్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాం’ అని పోలీసులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని